- తుర్కియేపైకి కూడా మరోసారి ఇరాన్ క్షిపణి
- ఇరాన్ మిసైల్స్, డ్రోన్లను అడ్డుకున్నామన్న ఖతార్, తుర్కియే
- పదోరోజూ ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా అటాక్స్
- లెబనాన్‌పైనా భీకర బాంబు దాడులు
టెహ్రాన్/జెరూసలెం/వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇరాన్.. ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం సోమవారం నాటికి పదో రోజుకు చేరుకుంది. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు భారీ ఎత్తున వైమానిక దాడులు చేయగా.. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ తోపాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ స్థావరాలపైకి పెద్ద ఎత్తున మిసైల్స్, డ్రోన్ లను ప్రయోగించింది. ఫిబ్రవరి 28న అమెరికా, -ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ఇరాన్ అధికారులు ప్రకటించారు. ఈ నియామకానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ కూడా మద్దతు తెలిపారు. మరోవైపు, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అమెరికా సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు
కొనసాగుతున్నాయి.
ఖతార్ పైకి 17 మిసైల్స్..
ఇరాన్ నుంచి ప్రయోగించిన 17 బాలిస్టిక్ క్షిపణులు, 6 డ్రోన్లను ఖతార్ రక్షణ శాఖ సోమవారం విజయవంతంగా కూల్చివేసింది. ఈ దాడుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. సౌదీ అరేబియాలోని షైబా చమురు క్షేత్రం లక్ష్యంగా వస్తున్న డ్రోన్‌ను సౌదీ వైమానిక దళం అడ్డుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా, అమెరికా తన అత్యవసర రహిత ఉద్యోగులను, వారి కుటుంబ సభ్యులను సౌదీ వదిలి వెళ్లాలని ఆదేశించింది. బహ్రెయిన్ లోని మామీర్ గ్రామంలో ఒక పరిశ్రమపై ఇరాన్ దాడి చేయడంతో అక్కడ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బహ్రెయిన్ ప్రకటించింది. లెబనాన్ రాజధాని బీరుట్‌లోని ఘోబేరీ మునిసిపాలిటీపై ఇజ్రాయెల్ భారీ దాడులు చేసింది. ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌లో పౌర నివాస ప్రాంతాలపై వైట్ ఫాస్పరస్ (నిషిద్ధ రసాయనం) ఉపయోగిస్తోందని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ ఆరోపించింది. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తుర్కియే తన ఆరు ఎఫ్16 యుద్ధ విమానాలను, వైమానిక రక్షణ వ్యవస్థలను ఉత్తర సైప్రస్‌కు తరలించింది.
ఇజ్రాయెల్ పై మిసైల్ దాడులు.. ఒకరి మృతి
ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌పై ఇరాన్ మిసైళ్లతో విరుచుకుపడింది. ఈదాడుల్లో ఒకరు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియా ఏఎఫ్‌పీ నివేదించింది. టెల్ అవీవ్‌లో ఉదయం నుంచి 10కి పైగా పేలుళ్లు సంభవించినట్లు వెల్లడించింది. చమురు సంపన్న సమీప గల్ఫ్ దేశాలపై ఇరాన్ వైమానిక దాడులను ముమ్మరం చేయడంతో సోమవారం ఖతార్‌లోని దోహా అంతటా పేలుళ్లు వినిపించాయని, సెంట్రల్అమెరికాలోని మనామాలో హెచ్చరిక సైరన్లు మోగాయని జర్నలిస్టులు తెలిపారు. కాగా,తుర్కియే గగనతలంలో ఇరాన్చేపట్టిన రెండో బాలిస్టిక్ క్షిపణిని కూల్చివేసినట్లు నాటో రక్షణ వ్యవస్థ వెల్లడించింది. భద్రతా దృష్ట్యా ఆగ్నేయ తుర్కియేని విడిచి వెళ్లాలని అమెరికా పౌరులను కోరింది.
ఇరాన్ నౌక మునక ఘటనలో 104కు పెరిగిన డెత్స్
గత వారం శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా జరిపిన దాడిలో104 మంది మరణించారని, 32 మంది గాయపడ్డారని ఇరాన్ సైన్యం సోమవారం ధృవీకరించింది. మార్చి 1న సౌదీ అరేబియాలోని బేస్ పై ఇరాన్ దాడిలో గాయపడిన ఒక సైనికుడు సోమవారం మరణించడంతో, ఈ యుద్ధంలో ఇప్పటివరకు 8 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం బ హ్రెయిన్ లోని బేస్ పై తాము జరిపిన దాడిలో 21 మంది యూఎస్ సోల్జర్లు చనిపోయారని ఇరాన్ ప్రకటించగా.. ఈ మరణాలను అమెరికా ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఇక ఆదివారం అర్థరాత్రి సౌదీ అరేబియాలోని ఖర్జ్ నగరంలో జరిగిన దాడిలో ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులు మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు. ఈ దాడిలో ఒక భారతీయుడు మరణించాడని ముందుగా వార్తలు వచ్చాయని, కానీ దాడిలో చనిపోయినవారు ఇద్దరూ బంగ్లాదేశీయులే అని సౌదీ ప్రకటించింది. సోమవారం ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల వల్ల గగనతలం నుంచి కూలిన శిథిలాలు ఇజ్రాయెల్‌లోని మూడు ప్రాంతాల్లో పడ్డాయి. ప్రాణనష్టం వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
