పరిగి, వెలుగు: మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తిని మహిళ కుటుంబ సభ్యులు హత్య చేశారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ శుక్రవారం వివరాలు వెల్లడించారు.వికారాబాద్ జిల్లా దోమ మండలం బడెంపల్లి గ్రామానికి చెందిన కావలి లాలయ్య(60)కు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ప్రవర్తన మార్చుకోవాలని ఇరువురి కుటుంబ సభ్యులు పలుమార్లు చెప్పినా వారు పట్టించుకోలేదు. గురువారం సాయంత్రం బడెంపల్లి గ్రామంలో కావలి లాలయ్య, మహిళ కలిసి ఉండటాన్ని ఆమె కుటుంబ సభ్యులు గమనించారు.
గ్రామానికి చెందిన నీరటి భాస్కర్, నీరటి అంజిలయ్య, నీరటి శ్రీనివాస్, నీరటి శ్రీశైలం, నీరటి పద్మమ్మ కలిసి లాలయ్యపై వెదురు కర్రలు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో లాలయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మహిళ అక్కడి నుంచి తప్పించుకుంది. లాలయ్య కొడుకు కావలి మల్కయ్య ఫిర్యాదుతో మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
