మహబూబాబాద్ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. దుర్గమ్మ పండుగ చేసేందుకు చుట్టాలందరినీ పిలిచిన వ్యక్తి.. ఘనంగా వేడుక నిర్వహించాడు. అందరికీ చికెన్, మటన్ తో భోజనాలు ఏర్పాటు చేశాడు. బంధువులందరితో కలిసి భోజనం చేస్తుండగా మటన్ ముక్క గొంతులో ఇరుక్కుని చనిపోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
వివరాల్లోకి వెళ్తే.. దామరవంచ శివారు పిల్లిగుండ్లతండాలో 2026 ఏప్రిల్ 08 (బుధవారం) రాత్రి జరిగింది ఈ ఘటన. బానోతు బిచ్చా (54) అనే వ్యక్తి తన ఇంట్లో భక్తిశ్రద్ధలతో దుర్గమ్మ పండుగను నిర్వహించుకున్నారు. పండుగ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి విందు భోజనం చేస్తుండగా, అనుకోని ప్రమాదం సంభవించింది. భోజనంలో ఉన్న ఒక మటన్ ముక్క గొంతులో అడ్డుపడటంతో ఈ ప్రమాదం జరిగింది.
మటన్ ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఆయనకు ఊపిరాడలేదు. ఊపిరి తీసుకోవడానికి విలవిల్లాడుతున్న బిచ్చాను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించడంతో పండుగ ఇంట తీవ్ర విషాదం అలుముకుంది.
- మాంసం తినే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి:
మాంసం ముక్కలు గొంతులో ఇరుక్కుని మృతి చెందిన ఘటనలు పెరుగుతుండటంతో డాక్టర్లు పలు సూచనలు చేస్తున్నారు. ఆహారం తీసుకునేటప్పుడు ముక్కలు సరిగ్గా నమలకపోయినా లేదా వేగంగా మింగినా అవి అన్నవాహికకు బదులు శ్వాసనాళంలో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. దీనిని వైద్య పరిభాషలో ‘చోకింగ్’ (Choking) అంటారు. మాంసం ముక్క వంటి గట్టి పదార్థాలు శ్వాసనాళాన్ని పూర్తిగా మూసివేసినప్పుడు, ఊపిరితిత్తులకు అందాల్సిన ఆక్సిజన్ నిలిచిపోతుంది.
కేవలం కొద్ది నిమిషాల పాటు మెదడుకు ఆక్సిజన్ అందకపోతే వ్యక్తి స్పృహ కోల్పోవడం, గుండెపోటు రావడం లేదా మరణం సంభవించడం జరుగుతుంది. బిచ్చా విషయంలో కూడా మాంసం ముక్క గొంతులో లోతుగా ఇరుక్కుపోవడంతో గాలి ఆడే మార్గం మూసుకుపోయి, ఆసుపత్రికి చేరేలోపే ప్రాణాలు కోల్పోయాడని చెబుతున్నారు. అందుకే బాగా నమిలి తినాల్సిందిగా సూచిస్తున్నారు.
