మెదక్ జిల్లాలో విషాదం.. గణేష్ నిమజ్జనానికి వెళ్లిన యువకుడు... కుంటలో శవమై తేలాడు..

మెదక్ జిల్లాలో విషాదం.. గణేష్ నిమజ్జనానికి వెళ్లిన యువకుడు... కుంటలో శవమై తేలాడు..

మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.. జిల్లాలోని హవేలీ ఘనపూర్ తొగిటలో గణేష్ నిమజ్జనానికి వెళ్లిన యువకుడు కుంటలో శవమై తేలాడు. శుక్రవారం ( సెప్టెంబర్ 5 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తొగిట గ్రామానికి చెందిన 17 ఏళ్ళ సుధాకర్ అనే యువకుడు ఇవాళ సాయంత్రం రామస్వామి కుంటలో గణేష్ నిమజ్జనానికి వెళ్ళాడు. నిమజ్జనం అనంతరం కనిపించకుండా పోయాడు సుధాకర్.

సుధాకర్ కనిపించకుండా పోవడంతో పోలీసులకు సమాచారం అందించారు గణేష్ మండపం నిర్వాహకులు. నిర్వాహకుల సమాచారంలో గాలింపు చేపట్టిన పోలీసులు రామస్వామి కుంటలో సుధాకర్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు హవేలీ ఘనపూర్ పోలీసులు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

సుధాకర్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గణేష్ నిమజ్జనానికి సందడిగా వెళ్లిన కొడుకు తిరిగిరాని లోకాలకు చేరడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు తల్లిదండ్రులు. సుధాకర్ ప్రమాదవశాత్తు కుంటలో పడిపోయాడా లేక ఆత్మహత్య చేసుకునేందుకే కుంటలో దూకాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.