
బాలాసోర్ రైలు ప్రమాదంలో తన భర్త ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ ప్రభుత్వం అందించే నగదు పరిహారం కోసం తప్పుడు సమాచారమిచ్చి చిక్కుల్లో చిక్కుకుంది. కటక్ జిల్లాలోని మణిబండకు చెందిన గీతాంజలి దత్తా.. జూన్ 2న జరిగిన రైలు ప్రమాదంలో తన భర్త బిజయ్ దత్తా మరణించాడని, ఓ మృతదేహాన్ని తన భర్తదిగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఆ తర్వాత డాక్యుమెంట్ల వెరిఫికేషన్ చేయగా.. ఆమె చెప్పిందంతా అవాస్తవమని తేలింది.
ఈ ఘటనలో మహిళను హెచ్చరించి పోలీసులు వదిలిపెట్టినప్పటికీ.. ఆమె భర్త మానియాబంధ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆమెకు ఇబ్బందులు మొదలయ్యాయి. అరెస్టుకు భయపడి ఆ మహిళ ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు. తన మరణంపై నకిలీ ధృవీకరణ సమాచారాన్నించినందుకు, ప్రజా ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నించినందుకు గానూ తన భార్యపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజయ్ డిమాండ్ చేశారు.
గతంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మరణించిన వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించగా, ప్రధాని మోడీ రూ.2లక్షల పరిహారం ప్రకటించారు. ప్రమాదంలో ప్రకటించిన వారి కుటుంబాలకు రైల్వే మంత్రిత్వ శాఖ కూడా రూ.10లక్షల పరిహారం ప్రకటించింది.