114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు లైన్ క్లియర్.. రూ.3లక్షల 25వేల కోట్ల మెగా డీల్

114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు లైన్ క్లియర్.. రూ.3లక్షల 25వేల కోట్ల మెగా డీల్

భారత రక్షణ రంగంలో సరికొత్త శకం ఆరంభం కాబోతోంది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు లైన్ క్లియర్ అయ్యింది. భారత అమ్ములపొదిలోకి మరో 114 అత్యాధునిక యుద్ధ విమానాలు చేరనున్నాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఈ భారీ డీల్‌కు పచ్చజెండా ఊపింది. సుమారు రూ.3లక్షల 25వేల కోట్ల విలువైన ఈ ఒప్పందం.. భారత వాయుసేన సామర్థ్యాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే కాకుండా.. రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియాకు పెద్దపీట వేయనుంది.

ఈ భారీ డీల్ ప్రత్యేకత ఏమిటంటే.. మొత్తం 114 విమానాల్లో 18 విమానాలను ఫ్రాన్స్ నేరుగా ఫ్లై-అవే కండిషన్‌లో అందజేస్తుంది. మిగిలిన 96 విమానాలను భారత్‌లోనే అసెంబుల్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో దాదాపు 80 శాతం తయారీ పనులు దేశీయంగానే జరగడం విశేషం. అంతేకాకుండా స్వదేశీ పరిజ్ఞానాన్ని 60 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ పర్యటనలోనే ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది.

►ALSO READ | నకిలీ CBI,ముంబై పోలీసు ఆఫీసు.. మన ఆఫీసులతో మనల్నే మోసం చేస్తున్నారు. కంబోడియా స్కామ్ సెంటర్ వైరల్ వీడియో

రాఫెల్ యుద్ధ విమానాలు 4.5 జనరేషన్, ట్విన్ ఇంజిన్ సామర్థ్యం కలిగిన ఈ విమానాలు ఒకే ప్రయాణంలో గగనతల దాడులు, భూతలంపై దాడులు, నిఘా, అణు సామర్థ్య ప్రదర్శన వంటి బహుళ ప్రయోజనాలను నెరవేర్చగలవు. ప్రస్తుతం వాయుసేన వద్ద 36 రాఫెల్ విమానాలు ఉన్నాయి. అవి అంబాలాలోని గోల్డెన్ యారోస్, పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్కన్స్ స్క్వాడ్రన్లలో సేవలందిస్తున్నాయి.

ఈ డీల్‌తో పాటు భారత నౌకాదళం కోసం మరో 6 'P8i' నిఘా విమానాల కొనుగోలుకు కూడా రక్షణ శాఖ ఆమోదం లభించింది. అత్యాధునిక ఏవియానిక్స్, హెల్మెట్ మౌంటెడ్ సైట్స్, గ్లాస్ కాక్‌పిట్‌తో కూడిన రాఫెల్ విమానాలు వాయుసేన అమ్ములపొదిలోకి చేరితే.. సరిహద్దుల్లో మన బలం రెట్టింపు అవుతుంది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న భారత్ ఆశయానికి ఈ రాఫెల్ డీల్ ఒక బలమైన పునాదిగా నిలవనుంది.