ప్రభుత్వాసుపత్రిలో అరుదైన సర్జరీ:  నుజ్జునుజ్జయిన చేతిని అతికించారు

ప్రభుత్వాసుపత్రిలో అరుదైన సర్జరీ:  నుజ్జునుజ్జయిన చేతిని అతికించారు

కాకినాడ ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు అరుదైన సర్జరీ చేశారు. ప్రమాదవశాత్తు ఓ యంత్రంలో ఇరుక్కుని ఓ యువకుడి చేయి నుజ్జునుజ్జు కాగా అరుదైన సర్జరీతో ఆరు గంటలు శ్రమపడి చేతిని అతికించారు. ఛత్తీస్‌ గఢ్‌ లోని కిర్లాపాల్‌ కు చెందిన సోనా కురానీ రాజా నగరం మండలం నందరాడ కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. శుక్రవారం విధి నిర్వహణలో ఉండగా అతడి కుడి చేయి యంత్రంలో ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది.

శరీరం నుంచి వేరుపడిన అతడి చేతిని అతికించడం కష్టమని ప్రైవేటు డాక్టర్ చేతులెత్తేయడంతో.. అర్ధరాత్రి 12 గంటల సమయంలో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఆర్థోపెడిక్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బీఎస్‌ఎస్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని బృందం ఆరు గంటల పాటు సర్జరీలు చేసి శనివారం ఉదయానికి అతడి చేతిని తిరిగి అతికించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కుడి మోచేతి ఎముక పూర్తిగా బయటికి వచ్చి, చర్మం వేలాడుతున్న క్లిష్టమైన పరిస్థితుల్లో సర్జరీ ప్రారంభించామన్నారు.

చేతి లోపలి నరాలు పూర్తిగా దెబ్బతినడంతో చిన్నపాటి వైర్ల వంటివి అంతర్గతంగా ఏర్పాటు చేసి రాడ్లు వేశామన్నారు. ప్లాస్టిక్‌ సర్జన్‌ డాక్టర్‌ దుర్గాప్రసాద్‌ బృందం చర్మాన్ని తిరిగి అతికించే ప్రక్రియ చేపట్టిందని చెప్పారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌.మహాలక్ష్మి పర్యవేక్షణలో సర్జరీ విజయవంతమైందని తెలిపారు.