
హైదరాబాద్ జీడిమెట్లలో ఓ ప్రేమోన్మాది వీరంగం సృష్టించాడు. గత కొంతకాలంగా తనను ప్రేమించాలంటూ యువతిన వేధిస్తున్న యువకుడు ఆమె పనిచేసే సూపర్ మార్కెట్ కి వెళ్లి కత్తి కొని... ఆమెపై దాడికి స్కెచ్ వేశాడు. బుధవారం ( జులై 23 ) జీడిమెట్ల పరిధిలోని గాజులరామారంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం మోదుగుల గుడానికి చెందిన యువతి తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ కు వలస వచ్చి గాజులరామారంలో నివాసం ఉంటోంది. గతంలో వినయ్ అనే యువకుడు తనను ప్రేమిచామంటూ వేధిస్తుండటంతో నగరానికి వలస వచ్చినట్లు తెలిపారు యువతి కుటుంబసభ్యులు.
గతంలో వినయ్ వేధింపులు తాళలేక యువతి తల్లిదండ్రులు గ్రామంలోని పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి యువతి జోలికి రావద్దంటూ పేపర్ పై తీర్మానం చేశారు. కానీ, మూడు నెలల తర్వాత వినయ్ యువతి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో సిరోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. దీంతో పోలీసులు వినయ్ ను స్టేషన్ కు పిలిపించి ఫోటోలు డిలీట్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు.
Also Read:-తండ్రి మర్డర్.. తల్లిని పట్టించిన మూడేళ్ల కూతురు..!
అక్కడితో ఆగని వినయ్.. గాజులరామారంలో యువతి పని చేస్తున్న సూపర్ మార్కెట్ కు వచ్చి కత్తి కొని.. అక్కడే ఆమెపై దాడికి స్కెచ్ వేశాడు. ఇది గమనించిన యువతి సూపర్ మార్కెట్ లోపలికి వెళ్లి దాక్కొని విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు వినయ్ ని పట్టుకొని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. వినయ్ ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.