కాపురానికి షిఫ్ట్లు వేశాడు.. ఇద్దరు భార్యల ముద్దుల సాఫ్ట్వేర్ ఇంజినీర్

కాపురానికి షిఫ్ట్లు వేశాడు..  ఇద్దరు భార్యల ముద్దుల సాఫ్ట్వేర్ ఇంజినీర్

శోభన్ బాబు, వాణిశ్రీ, శారద నటించిన  ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ అనే సినిమా గుర్తుంది కదా.. సరిగ్గా ఇలాంటి సినిమా స్టోరీనే రియల్గా మధ్యప్రదేశ్‌లో జరిగింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 2018లో 26 ఏళ్ల యవతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె అప్పుడు గర్భవతి కావడంతో అతను ఆమెను  గ్వాలియర్‌లోని తన తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లాడు. ఆ తరువాత కరోనా వలన లాక్ డౌన్ రావడంతో ఆమెను తీసుకెళ్లలేదు. పరిస్థితి సద్దుమణాక వచ్చి తీసుకెళ్లానని చెప్పాడు. ఈ క్రమంలో ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే తన మొదటి పెళ్లి విషయాన్ని దాచిపెట్టి తన కంపెనీలో పనిచేసే సహోద్యోగిని 2021లో పెళ్లి   చేసుకున్నాడు.  కొద్దిరోజులకు ఆమె కూడా గర్భవతి అయి ఆడపిల్లకు జన్మనిచ్చింది.

మొత్తానికి ఈ విషయం తెలుసుకున్న మొదటి భార్య ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది. అయితే ఈ కేసును సామరస్యంగా ముగించేందుకు హరీశ్ దివాన్ అనే ఓ లాయర్ ను కోర్టు నియమించింది. ఆ ముగ్గురితో చర్చించిన ఆ లాయర్..వారి మధ్య ఒక ఒప్పందాన్ని కుదిర్చాడు. తన భర్తను జైలుకు పంపించాలని తనకు ఇష్టం లేదని మొదటి భార్య చెప్పింది. మొదటి భార్యను తీసుకువెళ్లడానికి ఆసక్తి చూపని ఆ ఇంజినీర్ కు.. మొదటి వివాహం చెలామణిలో ఉండగానే, రెండో పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరమని, ఆమె కేసు వేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని లాయర్ వివరించాడు. మొదటి భార్యతో కలిసి ఉండడానికి తనకు అభ్యంతరం లేదని రెండో భార్య స్పష్టం చేసింది. దీంతో వారంలో తొలి మూడు రోజులైన సోమవారం, మంగళవారం, బుధవారం మొదటి భార్య వద్ద.. చివరి మూడు రోజులైన గురువారం, శుక్రవారం, శనివారం రెండో భార్య వద్ద ఉండేలా, ఆదివారం మాత్రం తనకు ఇష్టమైన వారి వద్ద ఉండేలా ఒప్పందాన్ని సిద్ధం చేశాడు.

అంతేకాకుండా ఆ వ్యక్తికి వచ్చే నెలవారీ వేతనం రూ. 1.5 లక్షలను ఇద్దరు భార్యలకు సమంగా పంచేలా, అతడికి ఉన్న రెండు ఫ్లాట్లను ఇద్దరు భార్యలకు చెరొకటి రిజిస్టర్ చేసేలా ఒప్పందంలో పొందుపర్చాడు. ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నట్లు ఆ ఇంజినీర్, ఆయన ఇద్దరు భార్యలు గ్వాలియర్ ఫ్యామిలీ కోర్టుకు తెలిపారు. ఈ ఒప్పందాన్ని  అతిక్రమిస్తే, కోర్టుకు ఫిర్యాదు చేసే హక్కు మొదటి భార్యకు మాత్రమే ఉంటుంది. కోర్టు ద్వారా జరిగిన ఈ ఒప్పందంపై న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది.