ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లతో నకిలీ టీటీడీ దర్శనం టికెట్లు: పోలీసులకి పట్టించిన బాధితులు..

 ఎంపీలు, ఎమ్మెల్యేల పేర్లతో నకిలీ టీటీడీ దర్శనం టికెట్లు: పోలీసులకి పట్టించిన బాధితులు..

మోసానికి కాదేది అడ్డు అన్నట్లు నంద్యాలలో ఏకంగా టిటిడి దర్శనం నకిలీ లెటర్ తయారు చేసి వేల రూపాయలకు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. భాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని నంద్యాల వన్ టౌన్ పోలీసులు తెలిపారు.  

వివరాలు చూస్తే నంద్యాల వన్ టౌన్ పరిధిలోని బైర్ మల్ వీధిలో అద్దెకు ఉంటున్న వెంకటేశ్వర్లు అనే యువకుడు నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లాల పరిధిలోని  ఎంపీలు,  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అధికారిక లెటర్లల ఉండే నకిలీ  లెటర్లు తయారు చేస్తూ అలాగే వారి సంతకాలు కూడా పోర్జరీ చేసి వాటిని ఉద్యోగ ట్రాన్సఫర్లకు, కొత్త ఉద్యోగాలకు, తిరుమల దర్శనం కోసం వేల రూపాయలకి అమ్ముతున్నాడని కొందరు భాధితులు గురువారం నంద్యాల వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఈ మోసం నంద్యాల ఎంపీ లెటర్, సంతకంను  పోర్జరీ చేసి తిరుమల శ్రీ వెంకటేశ్వర్లస్వామి దర్శనం కోసం వెళ్లిన బాధితులకు బుధవారం (13-08-2025)వ తేదీన తిరుమల టిటిడి జేఈఓ కార్యాలయంలో వద్ద బయటపడింది.  ఇది ఎంపీ లెటర్ కాదు, నకిలీ లెటర్ అని, దర్శనం లేదని చెప్పడంతో అసలు సంగతి  బయట పడింది. 

వెలుగోడు మండలం గుంతకంధాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే యువకుడు నంద్యాల పట్టణంలోని బైర్మల్ వీధిలో అద్దెకు ఉంటూ ఈ మోసానికి పాల్పడినట్లు చెప్పారు. అంతేకాదు బాధితులే మోసం చేసిన వ్యక్తి వెంకటేశ్వర్లును నంద్యాల వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. 

పోలీసుల విచారణలో  వెంకటేశ్వర్లు నుంచి చాల కొత్త కొత్త మోసాలు కూడా రాబట్టినట్లు తెలుస్తోంది. వెంకటేశ్వర్లు ఫోన్ డేటా ఆధారంగా బైర్మల్ వీధిలోని ఆయన అద్దెకు ఉంటున్న రూములో  అలాగే ఆయన సొంత గ్రామం గుంతకంధాలో కూడా పోలీసులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో వెంకటేశ్వర్లు మోసాల లిస్ట్ చాల ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి NMD ఫరూక్ పేరుతో కొందరికి ఉద్యోగాలకు నకిలీ మంత్రి లెటర్లు కూడా తయారు చేసినట్లు, మట్కా నెంబర్లు,  ప్రజా ప్రతినిధుల పోర్జరీ సంతకాలు సహా కొన్ని లెటర్లు కూడా గుర్తించారు. పట్టణంలోని సౌజన్య కాంప్లెక్స్ లోని మీసేవా కేంద్రంలో వెంకటేశ్వర్లు నకిలీ ప్రజా ప్రతినిధుల లెటర్లు ప్రింట్ తీసినట్లు విచారణలో తెలిసింది. బాధితుల ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్లని విచారణ చేస్తున్నామని  పూర్తి విచారణ తరువాత వివరాలు వెల్లడిస్తామని  వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి అన్నారు.