అనిల్ రావిపూడి సినిమాతో.. మరోసారి బయ్యర్లకు లాభాల పండగ.. 6 రోజుల్లోనే మెగా బ్రేక్ ఈవెన్!

అనిల్ రావిపూడి సినిమాతో.. మరోసారి బయ్యర్లకు లాభాల పండగ.. 6 రోజుల్లోనే మెగా బ్రేక్ ఈవెన్!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకర వరప్రసాద్’ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. లేటెస్ట్‌గా (జనవరి 18న) చిత్రబృందం విడుదల చేసిన అధికారిక పోస్టర్స్ ప్రకారం, ఈ చిత్రం విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.261 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సంచలనాన్ని సృష్టించింది. మరోవైపు, ఇండియా వైడ్గా దాదాపు రూ.140 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించినట్లుగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు మేకర్స్. అద్భుతమైన వసూళ్లతో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి తనదైన ఎంటర్‌టైన్‌మెంట్ మ్యాజిక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కథ, వినోదం, కమర్షియల్ అంశాల సమ్మేళనంతో ఈ సినిమా బయ్యర్లకు నిజమైన పండగగా మారింది.

సాధారణంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాలు, సేఫ్ జోన్‌లోకి రావడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుండగా, ‘మన శంకర వరప్రసాద్’ మాత్రం రికార్డ్ టైమ్‌లో అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని క్లీన్ హిట్ స్టేటస్‌ను దక్కించుకుంది. దీంతో బయ్యర్లు ప్రస్తుతం భారీ లాభాల దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. 

300 కోట్ల క్లబ్ దిశగా ‘మన శంకర వరప్రసాద్’ దూకుడు:

‘మన శంకర వరప్రసాద్’ సినిమా ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని, అన్ని ఏరియాల్లో లాభాల బాట పట్టింది. శనివారం (Jan17) ఒక్కరోజే రూ.35 కోట్ల వసూళ్లు నమోదు అయ్యాయి. ఆదివారం సెలవు కావడం, సంక్రాంతి పండుగ వాతావరణం కొనసాగడం, కుటుంబ ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకు రావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆదివారం రూ.40 కోట్ల వరకు వసూలు చేస్తే, ఈ చిత్రం ఏడు రోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన సినిమాగా చరిత్ర సృష్టించనుంది.

ఓవర్సీస్ మార్కెట్‌లో ‘శంకర వరప్రసాద్’ ప్రభంజనం కొనసాగుతుందనే విషయాన్ని తాజా బాక్సాఫీస్ వసూళ్లు స్పష్టంగా రుజువు చేస్తున్నాయి. కేవలం నార్త్ అమెరికాలోనే $2.5 మిలియన్స్ వసూళ్లు సాధించింది. అంటే తెలుగులో దాదాపు రూ.23కోట్లు. ఇకపోతే, ఇప్పటివరకు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా మార్కెట్లలో కలిపి ఈ చిత్రం రూ.30 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా మంచి స్థిరత్వంతో ముందుకు సాగుతోందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అనిల్ రావిపూడి సక్సెస్.. బయ్యర్లకు లాభాల పండగ:

దర్శకుడు అనిల్ రావిపూడి 2025లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు. ఈ సినిమా ద్వారా అనిల్ రావిపూడి మరోసారి తన మార్కెట్ స్టామినా ఏమిటో నిరూపించారు. ముఖ్యంగా, చాలా కాలం తర్వాత డిస్ట్రిబ్యూటర్లు కూడా లాభాలు పొందిన సినిమా కావడం ఈ విజయానికి మరింత ప్రాధాన్యతను ఇచ్చింది.

లేటెస్ట్గా ‘మన శంకర వరప్రసాద్’ మూవీతో మరోసారి ఆ మైల్ స్టోన్ చేరుకొని శభాష్ అనిపించుకున్నారు అనిల్. ఈ క్రమంలో సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆయన మేకింగ్, కథా నిర్వహణపై సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను సమర్థవంతంగా డెలివర్ చేయడంలో అనిల్ రావిపూడి తనదైన ముద్ర వేసారని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.