‘మన ఊరు- మన బడి’లో సెంట్రల్ ఫండ్సే ఎక్కువ

‘మన ఊరు- మన బడి’లో సెంట్రల్ ఫండ్సే ఎక్కువ
  • ఫస్ట్ ఫేజ్‌‌‌‌లో 3,500 కోట్లు అవసరం.. ఇందులో రూ.2,500 కోట్లు కేంద్రం నుంచే!

హైదరాబాద్, వెలుగు: బడుల్లో ఫెసిలిటీస్ కోసం రూపొందించిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి కేంద్రం నిధులే ఎక్కువగా రాష్ట్ర సర్కారు ఖర్చు చేయనున్నది. ఈ పథకానికి అవసరమైన ఫండ్స్‌‌‌‌ను సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), నరేగా(ఎంజీఎన్ఆర్ఈజీఎస్), ఏసీడీపీ, నాబార్డ్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, జిల్లాపరిషత్, మండల పరిషత్, గ్రంథాలయ సంస్థల నుంచి సేకరించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడేండ్లలో రూ.7,289.54 కోట్లు ఖర్చు చేస్తామని తెలిపింది. ఈ స్కీమ్‌‌‌‌కు సంబంధించిన పరిపాలనా పరమైన అనుమతులిస్తూ గురువారం విద్యాశాఖ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా జీవో నంబర్ 4ను రిలీజ్ చేశారు. ఫస్ట్ ఫేజ్‌‌‌‌లో ఎక్కువ మంది పిల్లలు ఉన్న​ 9,123 స్కూళ్లలో ఈ ఏడాది ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఫస్ట్ ఫేజ్‌‌‌‌లో ఖర్చు చేసే సుమారు రూ.3,500 కోట్లలో కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్‌‌‌‌ నుంచే రూ.2,500 కోట్లకు పైగా నిధులు వస్తాయని, మరో వెయ్యి కోట్లు వివిధ రూపాల్లో రాష్ట్ర సర్కారు సేకరించనున్నట్టు ఓ ఉన్నతాధికారి చెప్పారు. 

డొనేషన్లిస్తే గదికి పేరు

డొనేషన్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర సర్కారు కొత్తగా ఆలోచిస్తోంది. రూ.10 లక్షలు, ఆపై విరాళం ఇస్తే స్కూల్‌‌‌‌లోని ఓ గదికి డోనర్ సూచించే పేరును పెడతారు. రూ.2 లక్షలు, ఆపై ఇస్తే స్కూల్ మేనేజ్‌‌‌‌మెంట్ కమిటీలో మెంబర్‌‌‌‌‌‌‌‌గా అవకాశమిస్తారు.

చేపట్టే పనులివీ..

గ్రామీణ ప్రాంతాల్లో ‘మన ఊరు -మనబడి’, పట్టణ ప్రాంతాల్లో ‘మన బస్తీ- మన బడి’ పేరుతో ఈ పథకం అమలు జరుగుతుంది. ఎంపిక చేసిన పనులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారు. పాలనపరమైన అనుమతులు ఇస్తారు. అవసరమైన ఏజెన్సీలను ఎంపిక చేస్తారు. సాంకేతిక పరమైన అనుమతులు సంబంధిత ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. పనులన్నీ స్కూల్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కమిటీల భాగస్వామ్యంతో చేపడుతారు. నీటి వసతితో టాయ్​లెట్ల ఏర్పాటు, కరెంట్, తాగునీటి సౌకర్యం, స్టూడెంట్లు, టీచర్లకు అవసరమైన ఫర్నిచర్‌‌‌‌ ఏర్పాటు, స్కూలుకు రంగులు, మరమ్మతులు, గ్రీన్‌‌‌‌ చాక్‌‌‌‌బోర్డ్‌‌‌‌ల ఏర్పాటు, కాంపౌండ్‌‌‌‌ వాల్స్‌‌‌‌ కట్టడం, కిచెన్‌‌‌‌ షెడ్ల నిర్మాణం, ఆధునిక హంగులతో కొత్త క్లాసు రూమ్‌‌‌‌ల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌‌‌‌ హాల్స్, డిజిటల్‌‌‌‌ విద్యకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు. సౌలతులు పెంచడం వల్ల ప్రభుత్వ స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్యను పెంచడం, నాణ్యమైన విద్యను అందించడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.