
బాసర, వెలుగు: మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మంగళవారం ఎత్తారు. మొత్తం 14 గేట్లు ఉండగా అన్నింటినీ పైకి ఎత్తి బ్యారేజీలో నిల్వ ఉన్న నీటిని గోదావరిలోకి వదిలిపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏటా జూలై 1 నుంచి అక్టోబర్ 28 వరకు నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా ప్రాజెక్టు గేట్లను తెరచి ఉంచుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కేంద్ర జల సంఘం అధికారుల పర్యవేక్షణలో మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలిపెట్టారు.
బాబ్లీ బ్యారేజీ గేట్లు ఎత్తడంతో ఒక టీఎంసీ నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ టి.శ్రీనివాసరావు గుప్తా, అప్పర్ గోదావరి డివిజన్ డీడబ్ల్యూసీ ఈఈ ఎంఎల్ ఫ్రాంక్లిన్ పాల్గొన్నారు. బాబ్లీ నుంచి నీటి విడుదలతో దిగువ ప్రాంతాల ప్రజలను రెవెన్యూ, పోలీస్ అధికారులు అప్రమత్తం చేశారు.