
Globe Civil Projects IPO: దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం మెరుగ్గా లాభాల్లో కొనసాగుతున్న సమయంలో వస్తున్న ఐపీవోలు కూడా ఇన్వెస్టర్లకు లాభాల వర్షాన్ని కురిపిస్తున్నాయి. దీంతో చాలా మంది ఐపీవో మార్కెట్లో బెట్టింగ్ వేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది గ్లోబ్ సివిల్ ప్రాజెక్ట్స్ కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ బోర్డ్ కేటగిరీలో వచ్చిన కంపెనీ షేర్లు ఇవాళ బీఎస్ఈలో ఒక్కోటి 29 శాతం ప్రీమియం ధర రూ.91.10 వద్ద అడుగుపెట్టగా.. ఎన్ఎస్ఈలో స్టాక్ 26 శాతం లాభంతో రూ.90 వద్ద బంపర్ లిస్టింగ్ చూసింది. దీంతో ఇన్వెస్టర్లు మెుదటి రోజే మంచి రాబడులను అందుకున్నారు. అలాగే ఇష్యూ సమయంలో ఐపీవో విశేష స్పందనతో 86 సార్లు ఓవర్ సబ్ స్క్రిప్షన్ కూడా నమోదు చేసింది.
కంపెనీ తాజా ఐపీవో నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.119 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందుకోసం కంపెనీ కోటి 17 లక్షల షేర్లను విక్రయించింది. దీనికోసం ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.67 నుంచి రూ.71గా ఉంచారు. రిటైల్ పెట్టుబడిదారుల కోసం ఐపీవో జూన్ 24 నుంచి జూన్ 26 వరకు అందుబాటులో ఉంచబడింది. లాట్ పరిమాణం 211 షేర్లుగా ఉంచటంతో ఇన్వెస్టర్లు కనీసం బెట్టింగ్ కోసం రూ.14వేల 137 ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ప్రధానంగా కంపెనీ ఐపీవో క్వాలిఫైడ్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి ఎక్కువగా స్పందనను పొందింది.
కంపెనీ ఈ ఐపీవోలో యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఒకరోజు ముందుగానే రూ.35కోట్ల 70 లక్షలను పెట్టుబడిగా అందుకుంది. వీరి 90 రోజుల లాకిన్ పిరియడ్ సెప్టెంబర్ 24తో ముగియనుంది. కంపెనీ ఐపీవో నుంచి సమీకరించిన మెజారిటీ మెుత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించగా మిగిలిన మెుత్తాన్ని మెషినరీ కొనుగోలుకు వాడనుంది.
కంపెనీ వ్యాపారం..
2002లో స్థాపించబడిన కంపెనీ దిల్లీ కేంద్రంగా తన వ్యాపారాలను కొనసాగిస్తోంది. ప్రస్తుతం సంస్థ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్ స్ట్రక్షన్ వ్యాపారంలో ఉంది. దేశంలోని 11 రాష్ట్రాల్లో కంపెనీ ఇప్పటి వరకు తన ప్రాజెక్టులను నిర్మించింది. ఇప్పటి వరకు 37 ప్రాజెక్టులను పూర్తి చేసిన సంస్థ ప్రస్తుతం 12 ప్రాజెక్టులను కొనసాగిస్తోంది.