కదిలిస్తే కన్నీళ్లే .. పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీ వద్ద బాధిత కుటుంబసభ్యుల రోదన

కదిలిస్తే కన్నీళ్లే .. పాశమైలారం కెమికల్ ఫ్యాక్టరీ వద్ద బాధిత కుటుంబసభ్యుల రోదన
  • హృదయవిదారకంగా ఘటన స్థలం 
  • తమ వారి మృతదేహాల కోసం కన్నీటితో ఎదురుచూపులు
  • పొట్టకూటి కోసం వస్తే ప్రాణాలే పోయాయని ఆవేదన 

సంగారెడ్డి, వెలుగు: పొట్టకూటి కోసం వచ్చి కెమికల్ ఫ్యాక్టరీలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను కదిలిస్తే కన్నీళ్లు ఉబికి వస్తున్నాయి. అప్పటి వరకు ఆ కుటుంబాల్లో ఉన్న ఆనందం ఆవిరై చివరకు శోకమే మిగిలింది. భర్తను పోగొట్టుకుని భార్య, కొడుకు దూరమై తల్లి, అన్నతమ్ముళ్ల కోసం ఎదురుచూస్తున్న సోదరులు  కన్నీరు మున్నీరవుతున్నారు. మృతదేహాలు శిథిలాల కింద నుంచి తీసుకువస్తుంటే ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారిపోయింది. మా వాళ్ళు ఎక్కడ? బతికున్నారా..  లేదా చెప్పండి సార్ అంటూ బాధిత కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు కారణంగా ఇప్పటికే 36 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు.

 మరో 54 మందికి గుర్తించి ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా అందులో దాదాపు పదిమంది కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా సుమారు 40 మంది కార్మికుల ఆచూకీ లభ్యం కావడం లేదు. వీరంతా శిథిలాల కింద ఉన్నారా లేక ఘటనకు భయపడి ఎక్కడికైనా వెళ్లి తలదాచుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

పడిగాపులు కాస్తూ.. 

ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు పరిశ్రమ వద్ద వారి వారి సంబంధీకుల గురించి పడిగాపులు  కాస్తున్నారు.   బీహార్ కు చెందిన జ్యోతి తన భర్త కాగ్ (30) కోసం ఎదురుచూస్తోంది. ఏడాది కొడుకుతో ఘటన స్థలం వద్ద కూర్చున్న జ్యోతి తన కడుపులో ఏడు నెలల భర్త ప్రతిరూపం ఉందంటూ రోదిస్తోంది.  బీహార్ కు చెందిన మరో మహిళ పరిమళ తన కొడుకు బబ్లూ ( 32) గురించి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని అడుగుతూ చేసేదేమీ లేక రెండు రోజులుగా సంఘటన స్థలం వద్దనే కూర్చుండిపోయింది. 

మంత్రి సమీక్ష

 పాశమైలారం సిగాచి ఫ్యాక్టరీ ప్రమాద స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర్ రాజనర్సింహ మంగళవారం రాత్రి సందర్శించారు. ఈ ఘోర ప్రమాద ఘటనపై మంత్రి  దామోదర్ అధికారులతో  సమీక్ష నిర్వహించారు. మంగళవారం  రాత్రి 10 గంటల వరకు స్వయంగా ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం ప్రభుత్వం అందిస్తుందన్నారు. 

అంబులెన్స్‌‌ లో సొంత రాష్ట్రాలకు తరలింపు 

 ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోగా వారి మృతదేహాల కోసం కుటుంబసభ్యులు విలపించిన తీరు కన్నీళ్లు పెట్టించింది. సోమవారం ఉదయం ఘటన జరగ్గా మంగళవారం వెలికితీసిన డెడ్ బాడీలను వారి సొంత ప్రాంతాలకు అంబులెన్స్ ల ద్వారా తరలించారు. ఇంకా ఆచూకీ దొరకని వారి కోసం కుటుంబసభ్యులు ఫొటోలు పట్టుకుని ఏడుస్తూ ఉండటం కదిలించేస్తోంది.