
- మొలకెత్తుతున్న విత్తనాలు
- ప్రాజెక్టులు వాగులు, చెరువులకు జలకళ
- వ్యవసాయ పనుల్లో అన్నదాతలు బిజీ..
- మంచిర్యాల జిల్లాలో ఎల్లో అలర్ట్
మంచిర్యాల/ఆదిలాబాద్, వెలుగు: మే నెలలో మురిపించి ఆ తర్వాత ముఖం చాటేసిన వర్షాలు రెండ్రోజులుగా కురుస్తు అన్నదాతల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో బుధ, గురువారాల్లో సైతం వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గత 24 గంటల్లో జిల్లాలో సగటున 8.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా దండేపల్లి మండలంలో 33.3, అత్యల్పంగా భీమారం మండలంలో 1.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ సీజన్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 168 మిల్లీమీటర్లకు గాను జిల్లాలో 104.5 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. 38 శాతం లోటు నెలకొంది.
పత్తికి ప్రాణం
ఆలస్యంగా పడుతున్న వానలు.. ఎండిపోతున్న దశలో ఉన్న పత్తి పంటకు ప్రాణం పోశాయి. ఈసారి సీజన్‌కు ముందే తొలకరి పలకరించడంతో రైతులు పత్తి విత్తనాలు ముందే నాటారు. కానీ తర్వాత ముఖం చాటేయడంతో పత్తి మొలకలు ఎండిపోయే దశకు చేరాయి. ఈ తరుణంలో కురుస్తున్న ముసురు వర్షం అన్నదాతల్లో ఆనందం నింపింది. అయితే వరి రైతులు మాత్రం భారీ వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు బోర్లు, బావుల కింద మాత్రమే నార్లు పోశారు. వర్షాధారంగా కాలువ నీళ్లపై ఆధారపడ్డ రైతులు మాత్రం నార్లు పోసుకోవడానికి మరికొద్ది రోజులు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. సోయా, కంది పంటలు మొలకెత్తి ఆశాజనంగా మారాయి.
ఎల్లంపల్లికి స్వల్పంగా వరద
మోస్తరుగా కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వస్తోంది. మంగళవారం 1365 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు కెపాసిటీ 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.593 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై స్కీంకు 304 క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు రిలీజ్ చేస్తున్నారు.
ప్రాజెక్టులు, నదులకు జలకళ
ఆదిలాబాద్ జిల్లాలోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం 100 మిల్లీమీటర్లు, మంగళవారం 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడే కాకుండా ఎగువనున్న మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టులు, నదులు జలకళను సంతరించుకుంటున్నాయి. చెరువులు నిండుతున్నాయి. రాష్ట్రంలోనే ఎత్తయిన జలపాతంగా పేరొందిన నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం పరవళ్లు తొక్కుతోంది. తాంసి మండలంలోని మత్తడివాగు, సాత్నాల మండలంలోని సాత్నాల ప్రాజెక్టులకు నీటి మట్టం పెరుగుతోంది. సాత్నాల ప్రాజెక్టు మొత్తం 286 మీటర్లు కాగా ప్రస్తుతం 281.50 మీటర్లకు చేరుకుంది. మత్తడి ప్రాజెక్టులోని 40 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు మొత్తం 277.50 మీటర్లకు గాను నీటిమట్టం 275 మీటర్లకు చేరుకుంది.