ఏసీబీ కి పట్టుబడిన తలకొండపల్లి తహసీల్దార్, వీఆర్ఏ

ఏసీబీ కి పట్టుబడిన తలకొండపల్లి తహసీల్దార్, వీఆర్ఏ

ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి తహసీల్దార్  నాగార్జున, వీఆర్ఏ యాదగిరి మంగళవారం ఓ మహిళా రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్​కుమార్​ వివరాలు వెల్లడించారు. తలకొండపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన రైతు సాయమ్మ తన 1.20 ఎకరాల భూమిలో 22 గుంటల భూమిని తన కొడుకుల పేరుతో రిజిస్ట్రేషన్​ చేసేందుకు గత నెల 9న స్లాట్  బుక్  చేసుకున్నారు. 10న రిజిస్ట్రేషన్  చేయాల్సి ఉండగా, తహసీల్దార్  నాగార్జున ఒక్కో స్లాట్ కు రూ.2 వేల చొప్పున లంచం డిమాండ్  చేశారు.

లంచం ఇచ్చేందుకు నిరాకరించడంతో సర్వర్  పని చేయడం లేదని వెనక్కి పంపించారు. దీంతో బాధితులు నాలుగు రోజుల కింద ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు రూ.10 వేలు ఇవ్వగా, ఏసీబీ ఆఫీసర్లు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వారిని ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. తలకొండపల్లి తహసీల్దార్, వీఆర్ఏను లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయాన్ని తెలుసుకున్న మండల రైతులు, బాధితులు ఆఫీస్​ ఎదుట పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.