రామాయంపేట, వెలుగు: వేగం కన్నా ప్రాణం విలువైనదని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ క్షేమంగా ఇళ్లకు చేరాలని ఎమ్మెల్యే రోహిత్ రావు సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గురువారం రామాయంపేటలో అరైవ్ అలైవ్ ప్రోగ్రాం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే, ఎస్పీ శ్రీనివాసరావు హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్ లో వాహనదారులకు హెల్మెట్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే యువకులతో కలిసి బైక్ నడిపారు.
అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాణం కన్నా విలువైనది ఏదీ లేదన్నారు. కాస్త ఆలస్యం అయినప్పటికీ క్షేమంగా ఇంటికి చేరాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ ఏటా జిల్లాలో అనేక ప్రమాదాల్లో వందలాది మంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది 450 మంది ప్రాణాలు కోల్పోయారని,1,000 మంది గాయపడ్డట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ బాలరాజ్, నాయకులు నాగరాజు, యాదగిరి, స్వామి పాల్గొన్నారు.
అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలి
రామాయంపేట్ మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే రోహిత్ కలెక్టర్ ను కోరారు. నిజానిజాలు తేల్చేందుకు జిల్లా ఆడిట్ ఆఫీసర్ ను విచారణ అధికారిగా నియమించారు. గత రెండేళ్లుగా మున్సిపాలిటీకి సంబంధించిన పనులు, ఖర్చుల వివరాలు, ఆర్థిక లావాదేవీలపై జిల్లా ఆడిట్ అధికారి ద్వారా పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
బీఆర్ఎస్ జనాల్ని ఆగం పట్టించింది
నిజాంపేట: గత బీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజల ఒక్కొక్కరి నెత్తి మీద రూ.2 లక్షల అప్పు చేసి ఆగం పట్టిచిందని ఎమ్మెల్యే రోహిత్ అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని రైతువేదికలో పలు గ్రామాలకు చెందిన 37 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ భవిష్యత్ లో నిజాంపేట మండలంలోని గ్రామాలను అభివృద్ధిలో, సంక్షేమ పథకాల్లో ముందుంచుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి, డీటీ రమ్య శ్రీ, ఆర్ఐ ప్రీతి, మండల సర్పంచుల ఫోరం ప్రెసిడెంట్ భానుప్రకాశ్ రెడ్డి, సర్పంచులు నరేందర్, మల్లేశం, మంజుల, కాంగ్రెస్ నాయకులు అమార్సేనారెడ్డి, లింగం గౌడ్, స్వామి పాల్గొన్నారు.
