పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలి  : కలెక్టర్  సిక్తా పట్నాయక్

మహబూబ్ నగర్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని నారాయణపేట కలెక్టర్  సిక్తా పట్నాయక్  ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో జిల్లా స్థాయి విజిలెన్స్  మానిటరింగ్  కమిటీ సమావేశం కలెక్టర్  అధ్యక్షతన జరిగింది. ఎస్పీ వినీత్, అడిషనల్  కలెక్టర్  శ్రీను హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్  మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసులను సీరియస్ గా తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.  ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు త్వరగా పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్​లోకి సంబంధిత విభాగం సిబ్బందికి సూచించారు.

డీఎస్పీ నల్లపు లింగయ్య రెండేండ్లుగా జిల్లాలో నమోదైన కేసుల వివరాలను వివరించారు. ప్రతి నెలా 30న సివిల్  రైట్స్  డే నిర్వహించి మినిట్స్ అందజేయాలని కలెక్టర్​ ఆదేశించారు. గిరిజన సంఘం నాయకుడు కిష్ట్యా నాయక్  మాట్లాడుతూ నాలుగైదు రోజుల తరువాత ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేస్తున్నారని కమిటీ దృష్టికి తీసుకురాగా, తన ఆఫీస్​కు వచ్చి తెలియజేయాలని ఎస్పీ వినీత్  సూచించారు. సభ్యుడు ఆశప్ప, ఆర్డీవో రాంచందర్ నాయక్, డీఏవో జాన్ సుధాకర్, డీఎంహెచ్​వో శైలజ, డీపీవో సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.