సంగారెడ్డి, వెలుగు: గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. గురువారం సంగారెడ్డిలోని దుర్గాబాయి దేశముఖ్మహిళా శిశు వికాస కేంద్రంలో సర్పంచుల శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా మాట్లాడారు. సర్పంచులు పంచాయతీ రాజ్ చట్టం–2018పై సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్పంచులకు ఆరు బ్యాచులుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ శిక్షణలో పంచాయతీల నిర్వహణ, గ్రామాభివృద్ధికి ప్రణాళికల రూపకల్పన, కుటుంబ సంక్షేమం, విద్య, ప్రజారోగ్యం, సామాజిక అభివృద్ధి వంటి కార్యక్రమాలపై పూర్తి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణను సర్పంచులు సద్వినియోగం చేసుకుని తమ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీపీవో జానకి రెడ్డి, డీఎల్పీఓలు అనిత, అమృత, సంజీవరావు, పంచాయతీరాజ్ అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.
డ్రగ్స్ ను నిర్మూలించాలి..
మత్తు పదార్థాలను నిర్మూలించి డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అడిషనల్ కలెక్టర్ పాండు సూచించారు. గురువారం కలెక్టరేట్ లో అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు, అడిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో కలిసి నార్కోటిక్స్ కో ఆర్డినేషన్ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. పాండు మాట్లాడుతూ మాదకద్రవ్యాల రవాణా చేసినా, వినియోగించినా ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయన్నారు. డ్రగ్స్ నియంత్రణకు జిల్లాలోని అన్ని కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో గీతం వర్సిటీ, మహేశ్వర మెడికల్ కాలేజీ, ఎమ్మెన్నార్ విద్యాసంస్థలు, వోక్సిన్ యూనివర్సిటీ ప్రతినిధులు, డీడబ్ల్యువో, డీసీహెచ్ఎస్, జిల్లా ఇంటర్‌విద్యాశాఖ, ఆర్టీసీ, వ్యవసాయ, విద్యాశాఖ అధికారులు, ఆటో యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
ఝరాసంగం: కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 12 నుంచి 20 వరకు జరిగే బ్రహ్మోత్సవాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సక్సెస్చేయాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. జాతర ఏర్పాట్లపై కలెక్టరేట్ లో ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిసి ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా భక్తులకు టాయిలెట్లు, స్నానాలకు షవర్లు, తాగునీటి సదుపాయాలు కల్పించాలన్నారు. దేవస్థానం వరకు వెళ్లే కనెక్టివ్ రోడ్లను రిపేర్చేయించాలన్నారు.
పారిశుధ్య నిర్వాహణ, విద్యుత్‌సరఫరా సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. గుడి లోపల, బయట, పార్కింగ్ ప్రాంతాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు తెలిపారు. అడిషనల్ ఎస్పీ రఘునందన్‌రావు, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, ఆర్డీవో దేవుజా, తహసీల్దార్ భాస్కర్, ఎంపీడీఓ మంజుల, ఈవో శివ రుద్రప్ప, పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్, సర్పంచ్ వినోద పాల్గొన్నారు.
