కొల్లాపూర్, వెలుగు:గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని, ప్రతి ఇల్లు లైబ్రరీ కావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. పట్టణంలో సీఎస్ఆర్ నిధులతో ఆధునికీకరించిన డిజిటల్ లైబ్రరీని కలెక్టర్ బదావత్ సంతోష్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దిన పత్రికలు చదవడాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. యువత జ్ఞానాన్ని పెంచుకునేందుకు లైబ్రరీలను వినియోగించుకోవాలని, పోటీ పరీక్షల్లో రాణించేందుకు వివిధ రకాల పుస్తకాలు, దినపత్రికలు దోహదం చేస్తాయని చెప్పారు. కొల్లాపూర్ పట్టణంలోని లైబ్రరీ మాదిరిగా జిల్లా కేంద్రంలోనూ లేదన్నారు. మరిన్ని పుస్తకాలు, వసతులు సమకూర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం పట్టణంలోని రాజుకోట ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణంలోని 153 స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణం కింద రూ.47.15 లక్షల చెక్కును అందించారు. రాష్ట్ర మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలు దుబారా ఖర్చులు తగ్గించుకొని ఆర్థికంగా బలపడాలని సూచించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. అనంతరం రైతువేదికలో సబ్సిడీ రోటోవేటర్లు, పవర్ స్ప్రేయర్, వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. ఆర్డీవో బన్సీలాల్, అధికారులు పాల్గొన్నారు.
