రామచంద్రాపురం, వెలుగు: కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. గురువారం భారతీనగర్ జీహెచ్ఎంసీ డివిజన్ పరిధిలోని ఎంఐజీ కాలనీలో రూ. 92 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు కార్పొరేటర్ సింధూ ఆదర్శ్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధిలోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు.
సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని చెప్పారు. కార్పొరేటర్ సింధు మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్ధం కమ్యూనిటీ హాల్, పార్క్ షెడ్, గ్రౌండ్ వాటర్ సంపు, రీడిండ్ రూమ్, ప్రహరీ, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. త్వరగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో మోహన్ గౌడ్, నాగమణి, రాజు యాదవ్, వెంకట్ రావు, రాములు, రాధాకృష్ణ, సత్యనారాయణ, భాస్కర్, రవీందర్ గౌడ్పాల్గొన్నారు.
