కన్నవాళ్లు వద్దనుకున్నా.. ఊపిరి పోస్తున్న ‘ఊయల’

కన్నవాళ్లు వద్దనుకున్నా.. ఊపిరి పోస్తున్న ‘ఊయల’
  • మాతా, శిశు ఆస్పత్రి సహా ఐదు ఆస్పత్రుల్లో ఏర్పాట్లు 
  • కరీంనగర్ లో 10 రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులను వదిలేసి వెళ్లిన తల్లిద్రండులు
  • శిశు విహార్ లో  పిల్లల సంరక్షణ

కరీంనగర్, వెలుగు: కన్నవాళ్లు కాదనుకున్న అభశుభం తెలియని చిన్నారులకు కరీంనగర్  మాతాశిశు కేంద్రంలోని ‘ఊయల’ ఊపిరి పోస్తోంది. తల్లిదండ్రులకు భారమైన పిల్లలను చేరదీసి చేయూతనందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో  కరీంనగర్  జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఇటీవల ప్రారంభించిన ఈ ‘ఊయల(క్రాడల్  బేబీ రిసెప్షన్  సెంటర్)’  ప్రోగ్రామ్  సత్ఫలితాలిస్తోంది. జూన్  చివర్లో 10 రోజుల వ్యవధిలోనే పేరెంట్స్​ ఇద్దరు చిన్నారులను వదిలేసి వెళ్లారు. ఆ చిన్నారులకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి సంరక్షణ నిమిత్తం శిశు విహార్ కు తరలించారు. ఈ ప్రోగ్రామ్ తో  చెత్త కుండిల్లో, చెట్ల పొదల్లో పసిపిల్లలను వదిలేసి వెళ్లే ఘటనలు తగ్గుముఖం పట్టే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

10 రోజుల్లో ఇద్దరు చిన్నారులు.. 

కరీంనగర్ జిల్లాలో మాతా, శిశు ఆస్పత్రి, ఎంసీహెచ్ తో పాటు చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్ ఆస్పత్రుల్లో ‘ఊయల’ను మే 12న ప్రారంభించారు. ఈ క్రమంలోనే  జూన్ 18న దివ్యాంగురాలైన మూడేళ్ల కూతురిని భారంగా భావించి వదిలేసి వెళ్లిపోయారు. ఆ చిన్నారికి అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి శిశు విహార్ కు తరలించారు. చిన్నారి వైకల్యంతో పుట్టడం వల్లే వదిలేసి వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే జూన్  28న మరో శిశువు చేరింది. 15 నెలల వయసు ఉన్న ఆ మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేశారు. ఆ పసికందుకు ఆస్పత్రి సిబ్బంది, సూపరింటెండెంట్  డాక్టర్  వీరారెడ్డి, ఆర్ఎంవో నవీనా, వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించి శిశు విహార్ కు తరలించారు.

తల్లిదండ్రుల సమాచారం సేకరించబోమని హామీ..

శిశువులను వదిలి వెళ్లే తల్లిదండ్రుల సమాచారం సేకరించబోమని, వారి గురించి ఎలాంటి ఎంక్వైరీలు చేయబోమని ‘ఊయల’ వద్ద అధికారులు ఓ బోర్డు పెట్టారు. ‘మీకు పుట్టిన శిశువును మీరు వద్దనుకుంటే ఇక్కడ ఏర్పాటు చేసిన ఊయలలో వదిలి వెళ్లగలరు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మీ బిడ్డను స్వీకరిస్తుంది. ఇక్కడ సీసీ కెమెరాలు లేవు. ఎలాంటి నిఘా లేదు. శిశువును వదిలేసిన వారి సమాచారం, వివరాలు సేకరించం. మీరు వదిలేసిన శిశువులు ప్రభుత్వ సంరక్షణలో ఉంటారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దత్తత ఇస్తాం. ఇక మాకు అప్పగించాలనుకుంటే వాట్సప్  నంబర్  9490881098 కు సమాచారం ఇవ్వొచ్చు. పుట్టిన శిశువు వద్దనుకుంటే బయట ముళ్ల పొదల్లో, చెత్త కుప్పల్లో, కాల్వల్లో వదిలేయడం వల్ల బిడ్డ ప్రాణాలకు ప్రమాదం. మాకు అప్పగించండి. బిడ్డను కాపాడండి’ అని అందులో పేర్కొన్నారు.

పిల్లలు వద్దనుకుంటే ఊయలలో వేయండి..

కలెక్టర్  పమేలా సత్పతి ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఊయలలో ఇప్పటి వరకు ఇద్దరు చిన్నారులను వదిలి వెళ్లారు. పిల్లలు వద్దనుకునే తల్లిదండ్రులు ఎక్కడో చెత్త కుప్పల్లో, రోడ్డు పక్కన వదిలేయాల్సిన పని లేదు. ఊయలలో వేయండి. వారికి అనారోగ్య సమస్యలు  ఉన్నా, వారి సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. –డాక్టర్  వీరారెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ జనరల్  హాస్పిటల్, కరీంనగర్