
భారతదేశంలో రియల్టీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలో అందరికీ ఇల్లు అనే భారత ప్రభుత్వ నినాదం ఇకపై కలలో మాటగానే మిగిలిపోయే ప్రమాదంలో పడింది. ప్రధానంగా దేశంలోని పెద్ద మెట్రో నగరాలు అయిన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణె, చెన్నై, హైదరాబాద్ వంటి సిటీల్లో.. తక్కువ ధరలో అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం అనేది కనుమరుగు అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులో ధరలో సొంతిల్లు దొరకటం గగనం అయిపోయినట్లు లేటెస్ట్ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి.
ప్రధాన నగరాల్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ ఇప్పుడు లగ్జరీ అపార్ట్ మెంట్ల నిర్మాణం వైపు మొగ్గుచూపిస్తున్నారు. ఎటు చూసినా హైరైజ్ టవర్లే కడుతున్నారు. 2020 నుంచి -24 మధ్య కాలంలో.. అంటే ఈ నాలుగేళ్లలో జనం ఆదాయం 5.4 శాతం మాత్రమే పెరగ్గా.. అపార్ట్ మెంట్, ఇతర ఇళ్ల ధరలు ఏకంగా 10 శాతం వరకు పెరిగినట్లు వెల్త్ అడ్వైజరీ సంస్థ ఫినాలజీ వెల్లడించింది. అంటే ఆదాయం కంటే ఇళ్ల ధరలు డబుల్ అయ్యాయి. ఈ కారణంగానే మధ్య తరగతి కుటుంబాలకు సొంతిల్లు అనేది కలగానే మారిపోయే ప్రమాదం ఉందని ఈ రిపోర్ట్ వెల్లడించింది.
2022 సంవత్సరంలో.. ఆయా నగరాల్లో అంటే ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి సిటిల్లో కోటి రూపాయల కంటే తక్కువ ధరలో లభించే అపార్ట్ మెంట్ ప్లాట్ల నిర్మాణాల సంఖ్య సరాసరి 3 లక్షలకు పైగా ఉండగా.. ఇప్పుడు ఆ ధరలో అంటే.. కోటి రూపాయలలోపు అపార్ట్ మెంట్ ప్లాట్ ల లభ్యత అనేది లక్షా 98 వేలకు పడిపోయింది. అంటే నాలుగేళ్లలోనే మధ్య తరగతి కుటుంబాలకు అందుబాటులోని బడ్జెట్ ఫ్రెండ్లీ అపార్ట్ మెంట్ల సంఖ్య సగానికి సగం పడిపోయింది.
హైదరాబాద్ లాంటి సిటీల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ హైరైజ్ టవర్స్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్ మెంట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. గత ఏడాది కాలంలో.. అంటే 2024, 2025 సంవత్సరాల్లో ప్రారంభం అయిన ప్రాజెక్టుల్లో 80 శాతం ఇలాంటివి. ఈ ప్రాజెక్టుల్లో అపార్ట్ మెంట్ ప్లాట్ ధర కనీసంలో కనీసం కోటి రూపాయలపైనే ఉంటుంది. ఇది మధ్య తరగతి అత్యంత భారంగా మారిందని.. దీంతో మధ్య తరగతి కుటుంబాలకు రాబోయే రోజుల్లో సొంతిల్లు అనేది కలగానే మిగిలిపోతుందని వెల్త్ అడ్వైజరీ సంస్థ ఫినాలజీ స్పష్టం చేస్తుంది.
ఢిల్లీలో 192 శాతం, బెంగళూరులో 187 శాతం, చెన్నైలో 127 శాతం ఈ తరహా ప్రాజెక్టులు పెరిగాయి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే మిడిల్ క్లాస్ బడ్జెట్ హోమ్స్ నిర్మాణం ఏకంగా 69 శాతం తగ్గిపోయినట్లు ఈ రిపోర్ట్ వివరించింది. లగ్జరీ ప్రాజెక్టులో ఇల్లు కొనుక్కోవాలంటే ఆదాయంలో ఎక్కువ శాతం ఈఎంఐ చెల్లింపులకు వెళ్లిపోతోందనే భయం మధ్య తరగతి కుటుంబాలను వెంటాడుతుంది. ఇక పిల్లల చదువు, వైద్యం వంటి ఖర్చులకు ఇబ్బందిగా మారుతుందనే ఆలోచనతో ఉన్నారని నిపుణులు చెబుతున్నారు. ఓవరాల్ గా మధ్య తరగతి కుటుంబానికి అపార్ట్ మెంట్ ప్లాట్ అంటే ఒకప్పుడు లగ్జరీగా అనిపించేది.. ఇప్పుడు అదే భారంగా మారే రోజులు వచ్చేశాయి.
పైగా రియల్టీ రంగంలో వాస్తవ విక్రయ ధరలకు ప్రభుత్వ లెక్కల్లో చూపే మెుత్తానికి భారీ వ్యత్యాసం ఉండటంతో బ్లాక్ మనీ ఈ రంగంలో అధికంగా సర్క్యులేట్ అవుతోంది. పన్నులను తప్పించుకునేందుకు చాలా మంది ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నట్లు తేలింది.
ఇలాంటి సమయంలో రియల్టీ రంగానికి నిజంగా భారీ మార్పులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. సర్కిల్ రేట్లను ప్రతి నెల మార్పులు చేయటం, ఖాళీగా ఉన్న ఇళ్లపై వేకెన్సీ టాక్స్ తీసుకురావటం, ఎన్ఆర్ఐ పెట్టుబడులపై నిబంధనలను కఠినతరం చేయటం వంటివి ముఖ్యమైనవిగా చెప్పబడుతోంది. అలాగే టైర్ 2, 3 నగరాల్లో కూడా ఇళ్ల లభ్యతను పెంచటితే నగరాల్లో ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు.