
ఈరోజుల్లో బ్యాంకింగ్ వ్యవస్థ అందించే సేవలు నిత్యావసరంగా మారిపోయాయి. బ్యాంకు ఖాతాల నుంచి అవి అందించే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వరకు రూల్స్ సమయానుగుణంగా మారుతున్నాయి. అయితే జూలై 1 నుంచి స్టేట్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ సంస్థలు తమ సేవల నిబంధనలను మార్చుతున్నట్లు ప్రకటించాయి. ఇవి కస్టమర్లపై ఆర్థికపరమైన ప్రభావాన్ని చూపుతున్నందున ఈ నిబంధనల మార్పుల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.
స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్:
క్రెడిట్ కార్డ్ విషయానికి వస్తే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన క్రెడిట్ కార్డ్ రూల్స్ కీలక మార్పులు చేసింది. ఇకపై ఎస్బీఐ కార్డ్ ఉపయోగించి వినియోగదారులు ఫ్లైట్ టిక్కెట్స్ కొనుగోలు చేస్తే వాటిపై విమాన ప్రమాద ఇన్సూరెన్స్ కవరేజీని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. జూలై 15 నుంచి వీటిని SBI Card ELITE, Miles ELITE, Miles PRIME కార్డు దారులకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ కవర్ లభించదని పేర్కొంది. అలాగే ఎస్బీఐ ప్రైమ్, పల్స్ కార్డులకు అందిస్తున్న 50 లక్షల కవరేజ్ కూడా తొలగిస్తున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. ఇదే క్రమంలో బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ మినిమం డ్యూ పేమెంట్ లెక్కించే ఫార్ములాలో కూడా కీలక మార్పులు చేసింది. ఇది వ్యక్తులపై అదనపు భారాన్ని మోపనుంది.
హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్:
ఇదే సమయంలో మరో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ తన క్రెడిట్ కార్డులపై ఛార్జీలను జూలై 1 నుంచి మార్పులకు శ్రీకారం చుట్టింది. అద్దె చెల్లింపులపై 1 శాతం, ఆన్ లైన్ గేమ్స్ చెల్లింపులకు 1 శాతం, యుటిలిటీలకు 1 శాతం, వాలెట్లోకి డబ్బులు లోడింగ్ కోసం 1 శాతం చార్జీలను ఫిక్స్ చేస్తూ నెలవారీ వాటికి గరిష్ఠ పరిమితులను అందించింది.
ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం రూల్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ తన సర్వీస్ ఛార్జీల్లో కీలక మార్పులను జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. దీని ప్రకారం వినియోగదారులు ఏటీఎంలలో చేసే మెుదటి 5 ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నెలకు ఉచితమని వెల్లడించింది. పరిమితి తర్వాత చేసే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కి రూ.23 చొప్పున సర్వీస్ చార్జ్ వసూలు చేయబడుతుందని వెల్లడించింది. అలాగే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు మాత్రం ఉచితంగానే ఉంటాయని పేర్కొంది. అలాగే బ్యాంక్ తన క్యాష్ డిపాజిట్ చార్జీలు, బ్రాంచ్ క్యాష్ విత్ డ్రా చార్జీలు, ఐఎంపీఎస్ పేమెంట్ ఛార్జీలు వంటి వాటిని సవరించింది.