ఇస్లామాబాద్: ఇటీవల పాకిస్తాన్ రహస్యంగా అణ్వాయుధా పరీక్షలు చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో అణ్వాస్త్ర పరీక్షల నిర్వహణపై పాకిస్తాన్ మౌనం వీడింది. ట్రంప్ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ తమ దేశం అణ్వాస్త్రాలు పరీక్షించలేదని పాక్ క్లారిటీ ఇచ్చింది. అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశం పాకిస్తాన్ కాదని పాకిస్తాన్ సీనియర్ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు సీబీఎస్ న్యూస్ నివేదించింది. పాకిస్తాన్ అణు పరీక్షలను నిర్వహించిన మొదటి దేశం కాదని.. అదే విధంగా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించిన మొదటి దేశం కూడా కాదని ఆయన క్లారిటీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో పాక్ అణ్వాధాయు పరీక్షలపై నెలకొన్ని సందిగ్ధానికి తెరపడింది.
ట్రంప్ ఏమన్నారంటే..?
అణ్వాయుధాలు కలిగిన దేశాలు దూకుడు చూపిస్తుండటంతో అమెరికా కూడా తన సొంత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అణ్వాస్త్ర పరీక్షలు చేపట్టాలని అమెరికన్ దళాలకు ట్రంప్ ఆదేశాలు సైతం ఇచ్చారు. ఇతర దేశాల మాదిరిగానే మేము కూడా మా అణ్వాయుధాలను పరీక్షించబోతున్నామన్నారు.
ఇటీవల గుట్టుచప్పుడు కాకుండా పాకిస్తాన్, చైనా, రష్యా, ఉత్తరకొరియో న్యూక్లియర్ టెస్టులు చేశాయని అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారి తీశాయి. ఈ ఏడాది ఏప్రిల్, మేలో పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భూకంపాలు పాక్ అణ్వాయుధ పరీక్షల వల్లే సంభవించి ఉండవచ్చనే పుకార్లకు ట్రంప్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన పాక్.. తమ దేశం అణ్వాయుధ పరీక్షలు నిర్వహించలేదని పేర్కొంది.
