
- రాష్ట్ర కోటాలో గత 3 నెలల్లో 2.25 లక్షల టన్నులు కట్
- సకాలంలో సరఫరా చేయకపోవడంతో సమస్య
- జులై, ఆగస్టులో కావాల్సింది 6 లక్షల టన్నులు
- అందుబాటులో ఉన్నది 3.17 లక్షల టన్నులే
- ఈ నెల కోటా పూర్తిగా రాకుంటే రైతులకు కష్టాలే
- స్టాక్ లేక రైతులకు తక్కువ బస్తాలు పంపిణీ
- సొసైటీలు, రైతు వేదికల ముందు క్యూలైన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటాలో కేంద్ర సర్కార్ కోతలు పెడ్తున్నది. దీనికి తోడు సకాలంలో ఎరువులు పంపడం లేదు. దీంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో యూరియా కష్టాలు మొదలయ్యాయి. వానాకాలం సాగు ప్రారంభం కావడంతో ఈ నెలతో పాటు ఆగస్టుకు సంబంధించి 6 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంది.
కానీ ప్రస్తుతం రాష్ట్రంలో 3.17 లక్షల టన్నుల యూరియా మాత్రమే అందుబాటులో ఉంది. కేంద్రం గత మూడు నెలల కేటాయింపులను సక్రమంగా చేసి ఉంటే, ఈ సమస్య వచ్చేదే కాదు. గత మూడు నెలల్లో మన కోటాలో ఏకంగా 2.25 లక్షల టన్నులు కోత విధించడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడ్తున్నారు. ఉదయమే సొసైటీలు, రైతు వేదికల వద్దకు చేరుకొని బారులు తీరుతున్నారు.
మున్ముందు ఎరువుల కొరత ఇలాగే ఉంటుందనే అనుమానంతో కొందరు రైతులు అవసరానికి మించి కొని స్టాక్పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితిని ముందే అంచనా వేసిన వ్యవసాయశాఖ.. కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ అడిషనల్ డైరెక్టర్‌ను ప్రత్యేకంగా ఢిల్లీకి పంపించి సంప్రదింపులు జరుపుతున్నారు.
కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్‌ను నేరుగా కలిసి కోరడంతో పాటు మరో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లెటర్సైతం రాశారు. ఈ క్రమంలో రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆందోళన చెందవద్దని, అవసరానికి మించి యూరియా కొని స్టాక్ పెట్టుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు.
కేంద్రం నుంచి తగ్గిన కోటా..
జూన్ వరకు రాష్ట్రానికి 5 లక్షల టన్నుల యూరియా కేటాయించాల్సి ఉండగా, కేంద్రం కేవలం 2.75 లక్షల టన్నులను మాత్రమే సరఫరా చేసింది. ఇందులో 1.28 లక్షల టన్నులను రైతులు ఇప్పటికే కొనుగోలు చేశారు. ఏప్రిల్‌లో 1.70 లక్షల టన్నులకు బదులు 1.22 లక్షల టన్నులు, మేలో 1.60 లక్షల టన్నులకు బదులు 87 వేల టన్నులు, జూన్‌లో 1.71 లక్షల టన్నులకు బదులు 67 వేల టన్నులు మాత్రమే కేంద్రం సరఫరా చేసింది.
మొత్తంగా గత మూడు నెలల్లో రాష్ట్ర కోటాలో 2.25 లక్షల టన్నులు కోత పడింది. జులై, ఆగస్టు నెలల్లో యూరియా వినియోగం ఎక్కువగా ఉంటుంది. పత్తి, మక్క, వరి పంటలకు 6 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేయగా, ప్రస్తుతం స్టాక్ 3.47 లక్షల టన్నులు మాత్రమే ఉంది. దీంతో ఈ నెల కేంద్రం కోత పెట్టినా, సరఫరాలో ఆలస్యం చేసినా రైతులకు తిప్పలు తప్పవు.
పెరుగుతున్న యూరియా అవసరాలు..
వానాకాలం సీజన్ షురూ అయింది. ఇప్పటికే పత్తి , మక్క జోరుగా సాగవుతోంది. ముఖ్యంగా నిజామాబాద్, నల్గొండ వంటి జిల్లాల్లో వరి నాట్లు ఊపందుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల రెండో వారంలో నాట్లు మరింత స్పీడ్ అందుకోనున్నాయి. ఇప్పటికే 25 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేయగా, రైతులు మొక్కలకు యూరియా వేస్తున్నారు. ఈ నెలలో మరో 25 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యూరియా వినియోగం భారీగా పెరుగుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో 12లక్షల టన్నులకు పైగా యూరియా అవసరాలు ఉండగా కేంద్రం కేవలం 9.80లక్షల టన్నులే కోటా కేటాయింపులే చేసింది.
కేటాయింపులు తక్కువ చేయడమే కాకుండా కేటాయింపుల్లోనూ తక్కువ సరఫరా చేయడంతో సమస్య ఎదురవుతోంది. కాగా, రైతులు కూడా మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళనతో అవసరం లేకున్నా యూరియా కొని స్టాక్పెట్టుకున్నారు. దీని వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని ఆఫీసర్లు చెప్తున్నారు. జిల్లాల్లో పలుచోట్ల స్టాక్ఖాళీ అవుతుండడంతో ఒక్కో రైతుకు ఒకటి, రెండు బస్తాలే ఇస్తున్నారు.
యూరియా కోసం పడిగాపులు..
కాగజ్‌నగర్/ బెల్లంపల్లి, వెలుగు: యూరియా కోసం సొసైటీ కార్యాలయాలు, రైతు వేదికల ముందు రైతులు పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం ఆసిఫాబాద్‌జిల్లా కౌటాల మండల కేంద్రంలోని గురుడుపేట సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేయగా ఉదయం 7 గంటల నుంచే రైతు వేదిక వద్దకు రైతులు బారులుతీరారు. అయితే ఉదయం 10 గంటల వరకు కూడా పంపిణీ మొదలుపెట్టలేదు.
ఆలోగా బయట వర్షం మొదలుకావడంతో రైతులు రైతు వేదికలోకి వచ్చారు. వందలాది మంది రైతులు తరలిరావంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. సహకార సంఘం పరిధిలో 5 లారీల యూరియా పంపిణీ చేశామని, మిగిలిన రైతులకు వచ్చే లోడ్‌లలో ఇస్తామని మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రేమలత పేర్కొన్నారు.
మరోవైపు మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ(డబ్ల్యూఎఫ్పీసీ) ఎదుట రైతులు మంగళవారం యూరియా కోసం బారులు తీరారు. ఈ క్రమంలో రైతుల మధ్య తోపులాట జరిగింది. వెనుకాల వచ్చిన కొందరు రైతులు ముందు వరుసలోకి వచ్చి నిలబడటంతో రైతుల మధ్య మాట మాట పెరిగి పరిస్థితి కొట్టుకునే వరకు వచ్చింది.
విషయం తెలుసుకున్న ఎస్సై ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించి క్యూలో ఉంచడంతో గొడవ సద్దుమణిగింది. తర్వాత పోలీసులు దగ్గరుండి యూరియా పంపిణీ చేయించారు. కేవలం 260 సంచుల యూరియానే రాగా, వాటి కోసం రైతులు ఎగబడ్డారు.