మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవల లగ్జరీ కారు అక్రమ రవాణా కేసులో చిక్కుకున్నారు. ఈ క్రమంలో ఆయన వద్ద ఉన్న పలు కార్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో కొనసాతుండగా.. ఇప్పుడు దుల్కర్ కు మరో ఊహించని షాక్ తగిలింది. ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న 'రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్' విషయంలో తలెత్తిన ఫుడ్ పాయిజనింగ్ కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. దీనిపై ఫిర్యాదులు అందాయి. దీంతో కేరళలోని పతనంథిట్ట కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రెస్సల్ కమిషన్ దుల్కర్ కు లీగల్ నోటీసులు జారీ చేసింది.
అసలేం జరిగిందంటే?
పతనంథిట్టలోని వల్లికోడ్‌కు చెందిన క్యాటరర్ పీఎన్ జయరాజన్ ఒక పెళ్లి రిసెప్షన్ కోసం 50 కిలోల 'రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్' బ్యాగును కొనుగోలు చేశారు. అయితే, ఆ బ్యాగుపై ప్యాకింగ్ తేదీ , ఎక్స్‌పైరీ తేదీ వంటి ముఖ్యమైన వివరాలు లేవని జయరాజన్ ఆరోపించారు. ఆ బియ్యంతో చేసిన బిర్యానీ తిన్న అతిథులలో చాలా మంది ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంఘటన ఆగస్టు 24, 2025న జరిగింది.
నష్టపరిహారం..
ఈ ఘటన కారణంగా తన వ్యాపారపై నమ్మకం దెబ్బతిందని, అనేక ఇతర వివాహ బుకింగ్‌లు రద్దయ్యాయని క్యాటరర్ జయరాజన్ తెలిపారు. దీంతో, రోజ్ బ్రాండ్ బిర్యానీ రైస్ మేనేజింగ్ డైరెక్టర్, మలబార్ బిర్యానీ అండ్ స్పైసెస్ మేనేజర్‌తో పాటు బ్రాండ్ అంబాసిడర్ దుల్కర్ సల్మాన్‌లను నిందితులుగా చేరుస్తూ ఆయన వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. నష్టపరిహారం కింద మొత్తం రూ. 5 లక్షలు, భియ్యం ఖర్చు రూ. 10,250, కోర్టు ఖర్చులు ఇవ్వాలని ఫిర్యాదుదారుడు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కమిషన్ ఈ ముగ్గురు నిందితులను డిసెంబర్ 3, 2025న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. హాజరు కాకపోతే తదుపరి చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.
సెలబ్రిటీల బాధ్యతపై చర్చ
భారతీయ వినియోగదారుల చట్టాల ప్రకారం.. ఒక సెలబ్రిటీ ఏదైనా ఉత్పత్తిని ఎండార్స్ చేసినప్పుడు, ఆ ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నా, ఉత్పత్తి నాణ్యతలో లోపం ఉన్నా .. ప్రచారకర్త కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. వినియోగదారులు ఆ సెలబ్రిటీని నమ్మి ఉత్పత్తిని కొనుగోలు చేస్తారు. కాబట్టి నాణ్యత విషయంలో నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత బ్రాండ్ అంబాసిడర్‌పై కూడా ఉంటుంది.
గతంలో మాగీ నూడిల్స్ విషయంలో కూడా బాలీవుడ్ అగ్ర నటులు అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్‌లకు నోటీసులు జారీ అయ్యాయి. లేటెస్ట్ గా పాన్ మసాలా విషయంలో సల్మాన్ ఖాన్ కూడా కోర్టు నుంచి నోటీసులు అందుకున్నారు. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ విషయంలో జరిగిన ఈ ఘటన.. ఆహార భద్రత ఫిర్యాదులో బ్రాండ్ అంబాసిడర్‌కు నోటీసు వెళ్లిన కొన్ని అరుదైన కేసుల్లో ఒకటిగా నిలుస్తోంది. ఆహార ఉత్పత్తులపై లేబుల్స్ లేకపోవడం తీవ్రమైన ఆహార భద్రతా ప్రమాదంగా పరిగణించబడుతుంది. అయితే ప్రస్తుతానికి దుల్కర్ సల్మాన్, 'రోజ్ బ్రాండ్' సంస్థ నుండి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.
