కుక్కతోక వంకర అన్నట్టు జైలుకెళ్లి వచ్చినా వీడి బుద్ధి మారలేదు.. సత్ప్రవర్తన కింద జైలు నుంచి రిలీజైన ఓ వ్యక్తి చోరీలు చేసి మళ్లీ పోలీసులకు దొరికాడు. ఈ ఘటన కరీంనగర్ జమ్మికుంటలో జరిగింది.
జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని నవంబర్ 5న మీడియా ముందు ప్రవేశ పెట్టారు పోలీసులు.
పోలీసుల వివరాల ప్రకారం.. సోమ సారయ్య అనే వ్యక్తి గతంలో భార్యను హత్య చేసి జీవిత ఖైదు శిక్ష పడి ఇటీవల సత్ప్రవర్తన కింద జైలు నుంచి విడుదలై దొంగతనాలకు పాల్పడుతున్నాడు. జైల్లో ఉన్న సమయంలో పలువురు దొంగలతో స్నేహం చేసి చోరీ మెలకువలు నేర్చుకున్నాడు. జమ్మికుంట పట్టణంలో ఎస్ఎల్ఎస్ జ్యువెలరీ షాప్ లతో పాటు పలు ఇండ్లలో చోరీలకు పాల్పడ్డాడు సారయ్య. ఇటీవల జగిత్యాల పట్టణంలోని ఎస్వీ జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేసి అడ్డంగా దొరికాడు. సారయ్య ఇప్పటి వరకు ఐదు దొంగతనాలు చేసినట్టు నిర్ధారించిన పోలీసులు..అతడి నుంచి కిలోన్నర వెండి, ఐదు గ్రాముల బంగారం, 38 వేల నగదుతో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు . నిందితుడు సారయ్యను రిమాండ్ కు తరలించారు పోలీసులు..
