
- గత డిసెంబర్‌కు సంబంధించి రూ.1,000 కోట్లు రావాలి
- ఆందోళనలో అన్నదాతలు
- ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్ల చుట్టూ తిరుగుతున్న వైనం
- జోగులాంబ గద్వాల జిల్లాలో 50 వేల ఎకరాల్లో సీడ్ పత్తి సాగు
గద్వాల, వెలుగు: గతేడాది సీడ్ పత్తి సాగుకు సంబంధించిన డబ్బులను కంపెనీలు ఇంకా ఇవ్వలేదు. ఏటా ఏప్రిల్, మే నెలల్లోనే ఇస్తుండగా ఈసారి ఆలస్యమవుతుండడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆర్గనైజర్లు, సబ్ ఆర్గనైజర్ల చుట్టూ తిరుగుతున్నారు. సీడ్‌పత్తి పండించి, కంపెనీలకు విత్తనాలను డిసెంబర్లోనే అప్పగించారు. ఇప్పటికీ డబ్బులు అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లాలో 50 వేల ఎకరాలలో సీడ్ పత్తి సాగవుతోంది. ఒక ఎకరాలో 400 ప్యాకెట్ల విత్తనాలు పండిన 2 కోట్ల ప్యాకెట్లు అవుతాయి. ఒక్కోదానికి రూ.500 చొప్పున రైతులకు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన వారికి రూ.1,000 కోట్లు రావాలి. ఒక్కొక్కరికి కనీసం రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రావాల్సి ఉంది.
60 రోజుల పంట..
సీడ్ పంటకు సంబంధించి మే నెలలో కంపెనీలు ఇచ్చిన ఫౌండేషన్ సీడ్ ను రైతులు సాగు చేస్తారు. 60 రోజులయ్యాక క్రాసింగ్(ఆడ చెట్టు మొగ్గకు మగ పువ్వుతో) చేస్తారు. ఈ ప్రక్రియను అన్నదాతలు, కూలీలు 2 నెలలపాటు చేస్తారు. పత్తి కాయలు పగిలి, పత్తి చేతికి రావడానికి మరో నెల టైం పడుతుంది. డిసెంబర్ వరకు రైతులు పండించిన పంటను జిన్నింగ్ వేసి, కంపెనీలకు సీడ్ విత్తనాలు అందిస్తారు.
ఆర్గనైజర్లకు వడ్డీ చెల్లింపు..
జిన్నింగ్ అయిపోయాక డిసెంబర్ లో కంపెనీలకు రైతులు విత్తనాలు అప్పగిస్తారు. వాటికి కంపెనీలు జీవోటీ(గ్రోత్ అవుట్ టెస్ట్ ) ద్వారా పాస్, ఫెయిల్ నిర్ణయిస్తారు. ఫెయిల్ అయితే రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. పాస్ అయితే ప్యాకెట్ కు రూ.500 చొప్పున చెల్లిస్తారు. డిసెంబర్ లో కంపెనీలకు విత్తనాలు ఇస్తే 4 నెలలు గడిచాక రైతులకు డబ్బులు ఇవ్వాలి. అప్పటివరకు రైతు ఆర్గనైజర్ ద్వారా తీసుకున్న డబ్బుకు వడ్డీ చెల్లిస్తూనే ఉంటాడు. ఇలా సీడ్ పత్తి పంటలో కంపెనీలు, ఆర్గనైజర్లు అన్నదాతలను దోపిడీ చేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. ఈ సీడ్ వ్యవహారమంతా లీగల్ గా జరగకపోవటమే ఇందుకు కారణమన్న చర్చ జరుగుతోంది.
దిగుబడి పెరిగిందని కుంటిసాకులు
ఈసారి సీడ్ పత్తి దిగుబడి గణనీయంగా పెరిగిందని, రైతులు పండించిన విత్తనాలను మార్కెట్ లో తాము అమ్మలేకపోయామని కుంటిసాకులు చెబుతూ కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని పలువురు ఆర్గనైజర్లు అంటున్నారు. కంపెనీలు ఇచ్చినా, ఇవ్వకపోయినా రైతులకు జవాబుదారీతనంగా తాము గ్రామాల్లో ఉంటాం కాబట్టి తమపై తీవ్రమైన ఒత్తిడి ఉందని చెబుతున్నారు. కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నామని, త్వరలోనే డబ్బులు వచ్చేలా చూస్తామని పేర్కొంటున్నారు.