కట్టి వదిలేసిన్రు !.. 7 ఏండ్లుగా వృథాగా రైతు బజార్

కట్టి వదిలేసిన్రు !.. 7 ఏండ్లుగా వృథాగా రైతు బజార్
  • మధ్యలోనే ఆగిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ పనులు
  • కామారెడ్డిలో రోడ్లపై కూరగాయల రైతుల అవస్థలు
  • అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం

కామారెడ్డి, వెలుగు:రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైతుల సొమ్ముతో షెడ్లు నిర్మించి వృథాగా వదిలేశారు. రూ.50 లక్షలతో నిర్మించిన రైతు బజార్ ఏడేండ్లుగా నిరుపయోగంగా ఉంది. రూ.7 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.లక్షలతో నిర్మించిన భవనాలు ఖాళీగా ఉండగా, మురుగు వాసన భరిస్తూ రైతులు రోడ్లపై కూరగాయలు అమ్మే పరిస్థితి ఏర్పడింది. 

కామారెడ్డిలో మార్కెట్‌ విస్తరణ అవసరం 

కామారెడ్డి జిల్లా కేంద్రంలో లక్షకు పైగా జనాభా నివసిస్తోంది. స్థానికులతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు కూరగాయల కొనుగోలుకు వస్తుంటారు. దశాబ్దాల క్రితం, అప్పటి జనాభాను దృష్టిలో ఉంచుకుని తిలక్‌ రోడ్డులో డైలీ మార్కెట్‌ ఏర్పాటు చేశారు. ఇప్పుడు పట్టణం విస్తరించడంతో పాటు జనాభా పెరగడంతో ప్రస్తుత మార్కెట్‌ సరిపోని పరిస్థితి ఏర్పడింది. టౌన్‌ విస్తరణకు అనుగుణంగా  మార్కెట్లు అభివృద్ధి చేయకపోవడంతో వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

డైలీ మార్కెట్లో వ్యాపారుల అడ్డా  

కామారెడ్డి డైలీ మార్కెట్‌ ఆవరణను వ్యాపారులు ఆక్రమించారు. చిన్న చిన్న షెడ్లు, ఖాళీ స్థలాల్లో వస్తు సామగ్రి, బైక్​లు పెడుతున్నారు. షాపులన్నీ వ్యాపారుల చేతుల్లో ఉండటంతో, కూరగాయల కంటే ఇతర వస్తువులు, చికెన్‌ సెంటర్లు ఎక్కువగా వెలిశాయి. దీంతో రైతులు కూర్చునే స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారు.

 షాపుల ముందు కూర్చునే రైతులు ఓనర్లకు డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. దీనికితోడు తైబజార్‌ కూడా చెల్లించాల్సి వస్తోంది. మార్కెట్‌ అంతా చికెన్‌ వ్యర్థాలతో కంపు కొడుతుండడంతో పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు రోడ్లపై కూర్చొని కూరగాయలు అమ్ముకోవడం తప్ప వేరే మార్గం లేదు. 

తాగునీరు.. మూత్రశాలలు లేవు   

కూరగాయలు అమ్మేందుకు గ్రామాల నుంచి పట్టణానికి వచ్చే వారిలో మహిళా రైతులే ఎక్కువగా ఉంటారు. కూరగాయల అమ్మే ప్రాంతాల్లో తాగునీరు, మూత్రశాలల వంటి మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. డైలీ మార్కెట్‌లో చెత్తాచెదారం, చికెన్‌ వ్యర్థాల మధ్య కూర్చొని భోజనం చేయాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా  మార్కెట్‌ ప్రాంతం ఆధ్వానంగా మారిందని దుమ్మెత్తిపోస్తున్నారు.

రైతు బజార్‌ వృథా..  

ఏడేళ్ల క్రితం గంజు ఆవరణలో రైతు బజార్‌ నిర్మించారు. ప్రభుత్వం మార్కెట్‌ కమిటీ నిధులు రూ.50 లక్షలతో షెడ్లు నిర్మించి వృథాగా వదిలేయడంతో అవి ప్రస్తుతం శిథిలావస్థకు చేరుతున్నాయి. ఇక్కడ రైతులకు షెడ్లు కేటాయిస్తే తైబజార్‌ చెల్లించాల్సిన అవసరం ఉండదు. తాగునీరు, మూత్రశాలలు, పార్కింగ్‌ వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. గంజు ఆవరణలోనే రూ.7 కోట్ల20 లక్షల అంచనా వ్యయంతో నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ కాంప్లెక్స్‌ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఉన్నతాధికారులు చొరవ చూపి పనులను పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. 

రోడ్లపై కూర్చుంటే... పోలీసులతో తిప్పలు  

తిలక్‌ రోడ్‌, సుభాష్‌ రోడ్‌, జేపీఎన్‌ చౌరస్తా ప్రాంతాల్లో రైతులు రోడ్లపై కూర్చొని కూరగాయలు అమ్ముతున్నారు. దీంతో రద్దీ పెరిగి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. రైతులు రోడ్లపై గంపలు పెట్టి అమ్ముతున్నందున పోలీసులు తరచూ హెచ్చరిస్తూ, అవసరమైతే తొలగించమంటున్నారు. కొత్త టౌన్‌ ప్రాంతంలో ప్రత్యేక మార్కెట్‌ లేక రైతులు, చిన్న వ్యాపారులు చర్చి కంపౌండ్‌ పక్క  రోడ్డు దారిలో అమ్మకాలు కొనసాగిస్తున్నారు.