(వెలుగు స్పోర్ట్స్ డెస్క్)
ఇండియాకు విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ఎన్నో ఏండ్ల కల.. ఇన్నాళ్లకు సాకారమైంది. దీనికి వందేండ్ల కిందటే అడుగులు పడ్డాయి. 1913లో కేరళలోని ఒక స్కూల్‌లో అనే కెల్లెవే అనే ఆస్ట్రేలియన్ టీచర్ అమ్మాయిలు కూడా క్రికెట్ ఆడాలన్న నియమం పెట్టడంతో దేశంలో మహిళల ఆటకు బీజం పడింది. కానీ, వందేండ్ల తర్వాత మన అమ్మాయిలు తమ సొంత దేశమైన ఆస్ట్రేలియాను ఓడించి, వరల్డ్ కప్ ఫైనల్‌కు దూసుకెళ్లి.. కప్పు గెలుస్తాని ఆ రోజు కెల్లెవే కూడా ఊహించి ఉండదు.
మన అమ్మాయిలు ఫైనల్‌కు చేరడం ఇది మొదటిసారి కాదు. కానీ 2025 కప్ మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఈ టోర్నమెంట్‌లో మన ధీర వనితలు ‘మేము గెలవగలమా?’ అనే భయాన్ని వీడి, ‘మేము గెలిచి తీరతాం!’ అనే గట్టి నమ్మకంతో ఆడారు.
సొంత గడ్డపై కప్పు గెలవడం మాత్రమే కాకుండా  దేశం మొత్తం విమెన్స్ క్రికెట్ గురించి మాట్లాడుకునేలా చేయడం కూడా ఒక గొప్ప విజయమే.
ఇండియాలో గత పదేండ్లలో అమ్మాయిల క్రికెట్‌కు ఆదరణ బాగా పెరిగింది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కొత్త స్టార్లను పరిచయం చేసింది. అయినా, మన దేశంలో అమ్మాయిలు క్రికెట్ ఆడటం ఇంకా ఒక పోరాటం లాంటిదే. కానీ, ఈ విజయం ఆ అభిప్రాయాన్ని కచ్చితంగా మార్చనుంది. ఈ ఫైనల్‌కు ముందు విమెన్ ఇన్ బ్లూ గతంలో రెండు వరల్డ్ కప్ ఫైనల్స్ (2005, 2017) ఆడి ఓడింది. కానీ 2025 ఫైనల్ వేరు. నవీ ముంబై స్టేడియం మొత్తం వందేమాతర నినాదాలు.. ఇండియా, ఇండియా అరుపులతో నిండిపోయింది.
‘ జై హో.. చక్ దే ఇండియా' పాటలు అందరిలో ఉత్సాహం నింపాయి. 40 వేల మంది మంది ప్రేక్షకుల కేరింతలు, కోట్లాది మంది అభిమానుల దీవెనల నడుమ కప్పు గెలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. క్రికెట్ అబ్బాయిలు మాత్రమే కాదు, అమ్మాయిలు కూడా ఆడగలరని నమ్మిన ప్రతి ఒక్కరికీ ఈ గెలుపు అంకితం ఇచ్చింది.
ముంబైలోనే పునాది...
మన మగువల క్రికెట్ ప్రయాణం ఎన్నో పోరాటాల కథలతో నిండినా వరల్డ్ కప్ అందుకున్న ముంబైలోనే వాళ్ల ఆటకు పునాది పడింది. క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మెంబర్ ఆలూ బాంజీ తన పేరు మీద 'ఆల్బీస్' అనే మొదటి మహిళల క్రికెట్ జట్టును స్థాపించింది. ఆ తర్వాత నాలుగేండ్లకు లక్నోలో విమెన్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది. అమ్మాయిని బయటకు పంపించడమే గగనమైన ఆ రోజుల్లో క్రికెట్ ఆడటం ఎంతో కష్టంగా ఉండేదని మాజీ కెప్టెన్ శాంత రంగస్వామి గుర్తు చేసుకుంది.
‘ఆ రోజులే వేరు. టోర్నీలకు వెళ్లి మేం పెండ్లి మండపాల్లో, స్కూల్ క్లాస్‌రూముల్లో పడుకునేవాళ్లం. మాతో పాటు బొద్దింకలు, ఎలుకలు కూడా ఉండేవి. అందరికీ కలిపి కొన్ని బ్యాట్‌లు మాత్రమే ఉండేవి, ఒకరి తర్వాత ఒకరం వాడుకునేవాళ్లం. ఒకే జత జెర్సీలు ఉండేవి. అయినా ఎవరూ బాధపడలేదు. ఈ రోజు చూస్తున్న ఈ గొప్ప ఆటకు పునాది వేసింది మేమే అని గర్వపడుతున్నాం’ అని చెప్పుకొచ్చింది.
మలుపు తిప్పిన మిథాలీ సేన
2006లో విమెన్ క్రికెట్‌ను బీసీసీఐ తమ ఆధీనంలోకి తీసుకోవడం ఒక పెద్ద మార్పు. మొదటిసారిగా మ్యాచ్ ఆడినందుకు రూ. 2,500 ఫీజు ఇచ్చారు. మామూలు గదుల స్థానంలో హోటల్ రూమ్‌లు, రిజర్వేషన్ లేని రైళ్ల బదులు ఏసీ ట్రైన్లు, విమానాలు వచ్చాయి. రెండేళ్ల తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రవేశం లభించింది. మొదట్లో బీసీసీఐ కూడా విమెన్ క్రికెట్‌ను ఒక భారంగానే చూసింది. కానీ, మన అమ్మాయిలు తమ ఆటతో అందరినీ ఒప్పించారు.
1997, 2000 వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌లో ఓడినా.. మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని జట్టు 2005లో తొలిసారి ఫైనల్ చేరి ఆస్ట్రేలియాతో ఓడినా.. అది ఏనాడైనా మన జట్టు వరల్డ్ చాంపియన్‌గా నిలుస్తుందనే నమ్మకం కలిగించింది. ఇక 2017 వరల్డ్ కప్ ఫైనల్ ఒక మరపురాని ఘట్టం. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై కేవలం 9 రన్స్ తేడాతో ఇండియా ఓటమి బాధ పెట్టినా అమ్మాయిల ఆట కోట్ల హృదయాలను గెలుచుకుంది. స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ వంటి వారు స్టార్లుగా మారారు.
గడచిన పదేండ్లలో బీసీసీఐ విమెన్స్ టీమ్‌కు కూడా అబ్బాయిలతో సమానంగా చూస్తూ.. వరల్డ్ క్లాస్ సౌకర్యాలు కల్పించింది. ఐసీసీలో చొరవ తీసుకోవడంతోఅన్ని జట్లకు  ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం వచ్చింది. దీన్ని విమెన్ క్రికెటర్లూ సద్వినియోగం చేసుకున్నారు. తమ ఆటతో అందరినీ మెప్పిస్తూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చారు. చివరకు వరల్డ్ కప్ నెగ్గారు. ఇది కేవలం ఒక గెలుపు మాత్రమే కాదు.. ఎన్నో ఏండ్ల నమ్మకానికి, పోరాటానికి దక్కిన 
అసలైన విజయం. హర్మన్ చెప్పినట్టు మన జట్టు ఇలాంటి విజయాలను అలవాటుగా మార్చుకోవాలని కోరుకుందాం!
ఇది ఆరంభమే..
వరల్డ్ కప్ విక్టరీ కేవలం ఆరంభం మాత్రమేనని, ఇకపై గెలవడం తమ జట్టుకు ఒక కొత్త అలవాటుగా మారాలని కెప్టెన్ హర్మన్ ప్రీత్ స్పష్టం చేసింది. ‘ఇది ఆరంభమే. మేము ఆఖరి అడ్డంకిని బద్దలు కొట్టాలనుకున్నాం, సాధించాం. కానీ ఇది ముగింపు కాదు, ఆరంభం మాత్రమే. మా తదుపరి ప్రణాళిక... ఈ గెలుపును ఒక అలవాటుగా మార్చుకోవడం. రాబోయే పెద్ద ఈవెంట్ల కోసం మేం సిద్ధంగా ఉన్నాం’ అని మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ ధీమా వ్యక్తం చేసింది.
మనసు చెప్పింది.. షెఫాలీకి బౌలింగ్ ఇచ్చా
తన మనసు చెప్పిన మాట విని షెఫాలీని బౌలింగ్‌కు దింపానని హర్మన్ తెలిపింది. ‘వోల్‌వార్ట్, సునే చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, నేను షెఫాలీని అక్కడ నిలబడి చూశాను. ఆమె బ్యాటింగ్ చేసిన తీరు చూస్తే, ఈ రోజు తనదే అని నాకు తెలుసు. ఆమె ఏదో ప్రత్యేకంగా చేస్తోందనిపించింది. అందుకే నా గట్ ఫీలింగ్ తో వెళ్లాలని నిర్ణయించుకున్నా.
కనీసం ఒక ఓవర్ అయినా ఆమెకు ఇవ్వాలని నా మనసు చెప్పింది, అదే చేశాను. అదే మ్యాచ్‌ను మలుపు తిప్పింది. వెంటవెంటనే వికెట్లు పడటంతో ప్రత్యర్థులు కొంచెం భయపడ్డారు. దాన్ని మేం సొమ్ము చేసుకున్నాం. ఆపై సరైన సమయంలో దీప్తి వచ్చి కీలక వికెట్లు తీసింది’ అని తెలిపింది. కోచ్ అమోల్ జట్టులో ఎప్పుడూ స్ఫూర్తి నింపుతూ ఉండేవాడని హర్మన్ చెప్పింది.
