ఉపాధి లో కొత్త పనులు.. తగ్గిన ఎర్త్వర్క్స్., పెరుగనున్న శాశ్వత నిర్మాణ పనులు

ఉపాధి లో కొత్త పనులు.. తగ్గిన ఎర్త్వర్క్స్., పెరుగనున్న శాశ్వత నిర్మాణ పనులు
  • 266 రకాల పనుల గుర్తింపు కోసం గ్రామసభలు
  • ఈజీఎస్​లో ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు 90 రోజుల పాటు పనులు

మహబూబాబాద్, వెలుగు: జాతీయ ఉపాధిహామీ పథకంలో కూలీలకు పని కల్పించడానికి నిబంధనలు సడలిస్తూ కొత్త పనులు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సారానికి గానూ ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తూ ఉపాధి పనులను ఈ నెల 30 వరకు గుర్తించనున్నారు. గతంలో కంటే భిన్నంగా మట్టి పనులను తగ్గించి, ప్రజలు ఆర్థికంగా బలోపేతమయ్యే పనుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 

జిల్లాలో ప్రధానంగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, అంగన్ వాడీకేంద్రాలు, సీసీ రోడ్లు, పాఠశాలల్లో టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, ప్రహరీ నిర్మాణ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటున్న పేదలకు ప్రతీ కుటుంబానికి 90 రోజుల పాటు ఈజీఎస్​లో పని కల్పించేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.

గుర్తించనున్న 266 రకాల పనులు.. 

నిబంధనల ప్రకారం పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల ఆమోదంతో పనులు గుర్తించాలి. ఉమ్మడి వరంగల్​ జిల్లా పరిధిలో వీలైనంత త్వరగా గ్రామసభలు పూర్తిచేసి మండల పరిషత్ కు, ఆ తర్వాత జిల్లా పరిషత్​కు పంపించి అనుమతులు తీసుకోనున్నారు. 

ఈజీఎస్​లో ప్రధానంగా అవెన్యూ ప్లాంటేషన్, బీడు భూముల అభివృద్ధి, చెక్​ డ్యామ్​ల మరమ్మతులు, ఫారెస్టుల్యాండ్​లో చెట్ల సంరక్షణలు, బౌండరీలు, కెనాల్​క్లియరెన్స్​లు, కమ్యూనిటీ టాయిలెట్స్​నిర్మాణం, స్కూల్​ గ్రౌండ్స్​ అభివృద్ధి​, ఆహార ఉత్పత్తి నిల్వల గోడౌన్లు, చెరువుల మరమ్మతులు, కనెక్టివిటీ రోడ్లు, ఇంకుడు గుంతలు, సైడ్​ డ్రైయిన్లు ఇలా మొత్తంగా 266 రకాల పనులను గుర్తించనున్నారు. 2026 మార్చి 31 వరకు ఈ ఏడాదికి సంబంధించిన ప్రణాళిక పనులు కొనసాగనుండగా, ఏప్రిల్ 1 నుంచి కొత్తగా గుర్తించిన పనులు ప్రారంభించనున్నారు.

తగ్గనున్న పూడికతీత పనులు..

గతంలో ఉపాధిహామీ పథకంలో ఎక్కువగా చెరువుల్లో పూడికతీత పనులు చేపడుతున్నారు. ఈ పనుల్లో ఏటా కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నా, క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు ఫలితాలు కనిపించడం లేదు. ఉపాధి హామీలో ఎక్కువగా శాశ్వత నిర్మాణ పనులు చేపట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇండ్లకు పనులు కల్పించడం హర్షనీయం..

వచ్చే ఆర్థిక సంవత్సరం 2026  ఏప్రిల్ 1 నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు మొత్తంగా 90 రోజులపాటు ఇంటి వద్దనే ఈజీఎస్​ పనులు కల్పించడం సంతోషంగా ఉంది. కనీస వేతనం ఒక రోజుకు రూ.250 నుంచి రూ.307 వరకు నిర్ణయించడంతో గృహ నిర్మాణానికి ఎంతగానో దోహదపడనుంది. కాంగ్రెస్​ ప్రభుత్వానికి పేదలంతా రుణపడి ఉంటారు. 
ఎర్రం యాకయ్య, ఖానాపురం, తొర్రూరు మండలం

గ్రామసభల నిర్ణయం మేరకు పనుల గుర్తింపు..

గ్రామసభల్లో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించడంతో పాటుగా ఎక్కువగా ప్రభుత్వ నిర్ణయం మేరకు శాశ్వత నిర్మాణ పనులకు ఈజీఎస్​ ప్రణాళికలో ప్రాధాన్యం ఇవ్వనున్నాం. మండల స్థాయి అధికారులకు ఇప్పటికే తగిన సూచనలను చేశాం. జిల్లాలో గ్రామ సభలు కొనసాగుతున్నాయి.    - 
మధుసూదన్​ రాజ్, డీఆర్డీఏ పీడీ, మహబూబాబాద్​ జిల్లా

జిల్లాల వారీగా ఈజీఎస్​ కూలీల వివరాలు
 జిల్లా                               జాబ్​ కార్డులు
 మహబూబాబాద                  2,20,483
వరంగల్                               1,20,003
జనగామ                               1,17,708
ములుగు                              8,61,45
హనుమకొండ                      85,143
జయశంకర్​భూపాలపల్లి    1,09,265