
ఇంగ్లాండ్ తో జరగనున్న రెండో టెస్ట్ కోసం టీమిండియా తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. బర్మింగ్‌హామ్ వేదికగా ఎడ్జ్ బాస్టన్ లో బుధవారం (జూలై 2) రెండో టెస్ట్ ప్రారంభమవుతుంది. తొలి టెస్ట్ ఇచ్చిన విజయంతో ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తుంటే.. రెండో టెస్టు ఎలాగైనా గెలవాలనే ఒత్తిడిలో భారత్ కనిపిస్తుంది. ఈ మ్యాచ్ లో గిల్ సేన భారీ మార్పులతో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తుంది. రెండు మార్పులు ఖచ్చితంగా ఉండగా.. మూడు మార్పులు జరిగినా ఆశ్చర్యం లేదు. ఇదంతా పక్కన పెడితే ఇండియా ప్రాక్టీస్ సమయంలో ఒక ఆసక్తికర సీన్ చోటు చేసుకుంది.
ప్రాక్టీస్ లో భాగంగా టీమిండియా ఆటగాళ్లు స్లిప్ కార్డన్ లో ఫీల్డింగ్ చేస్తూ కనిపించారు. అయితే స్లిప్ లో జైశ్వాల్ లేకపోవడం షాకింగ్ గా మారింది. అయితే ఇందుకు కారణం కూడా లేకపోలేదు. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో యశస్వి జైశ్వాల్ తన చెత్త ఫీల్డింగ్ తో టీమిండియా పరాజయానికి కారణమయ్యాడు. బ్యాటింగ్ లో సెంచరీ కొట్టి సత్తా చాటినా ఫీల్డింగ్ లో ఏకంగా నాలుగు క్యాచ్ లు మిస్ చేసి విమర్శల పాలయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో మూడు క్యాచ్ లు జారవిడిచి ఈ టీమిండియా ఓపెనర్.. రెండో ఇన్నింగ్స్ లో కీలకమైన డకెట్ క్యాచ్ అందుకోవడంలో విఫలమయ్యాడు. డకెట్ 97 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జైశ్వాల్ క్యాచ్ మిస్ చేశాడు.
డకెట్ క్యాచ్ మిస్ చేయడంతో ఈ ఇంగ్లీష్ ఓపెనర్ 149 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. చెత్త ఫీల్డింగ్ కారణంగా రెండో టెస్టుకు జైశ్వాల్ ను స్లిప్ నుంచి పక్కన పెట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రాక్టీస్ సెషన్ లో కరుణ్ నాయర్, రాహుల్, గిల్, సాయి సుదర్శన్, నితీష్ రెడ్డి స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు. బ్యాటింగ్ లో సత్తా చాటినా ఫీల్డింగ్ తప్పిదాలతో జైశ్వాల్ కు విమర్శలు తప్పడం లేదు. మరి రెండో టెస్టుకు జైశ్వాల్ ను స్లిప్ లో ఉంచుతారో లేకపోతే పక్కనపెడతారో చూడాలి.