టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజులకు ఒప్పుకోని మేనేజ్మెంట్లు

టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజులకు ఒప్పుకోని మేనేజ్మెంట్లు

అసంపూర్తిగా ముగిసిన మీటింగ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల లొల్లి మళ్లీ మొదటికొచ్చింది. ఫీజుల నియంత్రణ కమిటీ రెండోసారి నిర్ణయించిన ఫీజులను కొన్ని టాప్ కాలేజీలు ఒప్పుకోలేదు. దీంతో ఆ కాలేజీలతో తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్​ఆర్సీ) మరోసారి హియరింగ్ నిర్వహించనుంది. ఆ తర్వాతే సర్కారుకు ఫీజుల లిస్టు పంపించనుంది. ఆడిటింగ్ తప్పుల నేపథ్యంలో టీఏఎఫ్ఆర్సీ ఇటీవల రెండోసారి కాలేజీల్లో హియరింగ్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 173 కాలేజీల్లో ఫీజులు ఖరారు చేసేందుకు కమిటీ శనివారం సమావేశమైంది. చైర్మన్ స్వరూప్​రెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి, రిజిస్ర్టార్ మంజూర్ హుస్సేన్ తదితరులు హాజరయ్యారు. అయితే గతంలో నిర్ణయించిన దానికంటే ఫీజులు తగ్గడంతో మేనేజ్మెంట్ల నుంచి వ్యతిరేకత వచ్చింది. దాదాపు టాప్ 25 కాలేజీలు తమకు నిర్ణయించిన ఫీజులను ఒప్పుకోబోమని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయలేదు.

గత బ్లాక్ పీరియడ్ కంటే ఫీజులు తగ్గించడమేంటని మేనేజ్మెంట్లు ప్రశ్నించాయి. ఈ మేనేజ్మెంట్లు కోర్టును ఆశ్రయిస్తే మళ్లీ కొత్త సమస్య మొదలవుతుందని, ఆయా కాలేజీలకు మరోసారి హియరింగ్​కు అవకాశమివ్వాలని కమిటీ నిర్ణయించింది. అయితే కొన్ని కాలేజీల ఆడిటింగుల్లో గతంలోనూ ఇలాంటి తప్పులే వచ్చినట్టు కమిటీలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. కాగా, ఇప్పటి వరకు అత్యల్పంగా మేనేజ్మెంట్ కోరిక మేరకు ఓ కాలేజీకి రూ.35 వేల ఫీజు నిర్ణయించగా, మినిమమ్ ఫీజుగా రూ.45 వేలు ఖరారు చేశారు. అత్యధికంగా ఎంజీఐటీకి రూ.1.60 లక్షల ఫీజు ఫైనల్ చేశారు. కానీ 25 కాలేజీల్లో ఫీజుల పంచాయితీ తెగకపోవడంతో మరోసారి హియరింగ్ నిర్వహించి ఫీజులు ఖరారు చేసిన తర్వాతే సర్కార్ కు నివేదిక పంపించనున్నట్లు టీఏఎఫ్​ఆర్సీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.