మంచిర్యాలలో కట్నం కోసం భార్యను, సూర్యాపేటలో 2 గుంటల కోసం అక్కను చంపేసిన్రు..

మంచిర్యాలలో కట్నం కోసం భార్యను, సూర్యాపేటలో 2 గుంటల కోసం అక్కను చంపేసిన్రు..

సూర్యాపేట, వెలుగు : రెండు గుంటల భూమి కోసం ఓ వ్యక్తి తన అక్కపై కత్తితో దాడి హత్య చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌‌‌‌‌‌‌‌ (ఎస్) మండలం తుమ్మల పెన్‌‌‌‌‌‌‌‌పహాడ్‌‌‌‌‌‌‌‌ గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సైదులుకు అంజమ్మ (50), లింగమ్మ, ఉపేంద్ర (ఉమ) అక్కాచెల్లెళ్లు ఉన్నారు. 2007లో ఉపేంద్ర వివాహం జరుగగా... ఆమెకు సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌ 119లో 2.05 ఎకరాల భూమిని ఇచ్చారు. 

ఉపేంద్ర భర్త చనిపోవడంతో ఆమె తన అక్క అంజమ్మ వద్ద ఉంటోంది. ఉపేంద్రకు ఇచ్చిన భూమి విషయంలో సైదులుతో గొడవలు జరుగుతున్నాయి. ఉపేంద్రకు ఇచ్చిన భూమి 2.05 ఎకరాలు  కాదని 2.03 ఎకరాలేనని సైదులు గొడవ పడేవాడు. ఈ విషయంపై ఉపేంద్ర గతంలోనే గ్రామ పెద్దలు, పోలీసులు, ఆర్డీవో, కలెక్టర్‌‌‌‌‌‌‌‌ను సైతం కలిసింది. ఈ వివాదంలో ఉపేంద్రకు ఆమె అక్క అంజమ్మ మద్దతుగా నిలిచింది. 

దీంతో అంజమ్మపై కక్ష పెంచుకున్న తమ్ముడు సైదులు.. ఆమెను హత్య చేసేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం అంజమ్మ ఉపాధి పనికి వెళ్తుండగా.. సైదులు తన బావమరుదులతో కలిసి, కల్లు గీసే కత్తితో అంజమ్మపై దాడి చేసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న సూర్యాపేట ఎస్పీ నరసింహ, రూరల్ సీఐ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. క్లూస్‌‌‌‌‌‌‌‌టీం, డాగ్‌‌‌‌‌‌‌‌ స్క్వాడ్‌‌‌‌‌‌‌‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. 

సుత్తితో దాడి చేసి భార్యను...

చెన్నూరు, వెలుగు : అదనపు కట్నం తేవాలంటూ ఓ వ్యక్తి తన భార్యపై సుత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి చనిపోయింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామపంచాయతీ పరిధిలోని ఎల్లక్కపేట గ్రామంలో సోమవారం జరిగింది. చెన్నూరు టౌన్‌‌‌‌‌‌‌‌ సీఐ బన్సీలాల్‌‌‌‌‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... ఎల్లక్కపేటకు చెందిన చల్ల రమేశ్‌‌‌‌‌‌‌‌ ఇనుప సామాను వ్యాపారం చేస్తుంటాడు. ఇతడికి ఆరేండ్ల కింద గోదావరిఖనికి చెందిన శారదతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. రమేశ్‌‌‌‌‌‌‌‌తో పాటు అతడి తల్లిదండ్రులు, సోదరి కలిసి అదనపు కట్నం కోసం శారదను వేధించేవారు. 

ఇదే విషయంలో సోమవారం రమేశ్‌‌‌‌‌‌‌‌, శారద మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన రమేశ్‌‌‌‌‌‌‌‌ సుత్తితో శారద తలపై కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే చనిపోయింది. అనంతరం రమేశ్‌‌‌‌‌‌‌‌ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. శారద హత్య విషయం తెలుసుకున్న ఆమె బంధువులు పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. రమేశ్‌‌‌‌‌‌‌‌ను తమకు అప్పగించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేష్‌‌‌‌‌‌‌‌నలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో మృతురాలి బంధువులకు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న సీఐ బన్సీలాల్‌‌‌‌‌‌‌‌ పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌కు వచ్చి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. 

మద్యం మత్తులో స్నేహితుడి హత్య

పద్మారావునగర్, వెలుగు : మద్యం మత్తులో  ఓ వ్యక్తి తన స్నేహితుడిని హత్య చేశాడు. ఈ ఘటన సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ మోండా మార్కెట్‌‌‌‌‌‌‌‌ పీఎస్‌‌‌‌‌‌‌‌ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన పెద్ద నర్సింహులు (40), నారాయణపేట జిల్లాకు చెందిన ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కలిసి బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్స్‌‌‌‌‌‌‌‌ బస్తీలో ఉంటూ.. ఎన్‌‌‌‌‌‌‌‌టీపీసీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ ఐదో అంతస్తులో టైల్స్‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. 

ఆదివారం రాత్రి ఇద్దరూ కలిసి బిల్డింగ్‌‌‌‌‌‌‌‌ టెర్రస్‌‌‌‌‌‌‌‌పై మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దీంతో  ఆగ్రహానికి గురైన ఉత్తమ్ ఇనుప రాడ్‌‌‌‌‌‌‌‌తో నర్సింహులు తలపై కొట్టడంతో నర్సింహులు అక్కడికక్కడే చనిపోయాడు. సోమవారం ఉదయం సమాచారం అందుకున్న మోండా మార్కెట్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఉత్తమే హత్య చేసినట్లు నిర్ధారించారు. పరారీలో ఉన్న ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ కోసం గాలిస్తున్నామని ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ రామచంద్రం తెలిపారు.