మద్యం మానేసిన వాళ్లకే స్థానిక ఎన్నికల్లో టిక్కెట్లు

మద్యం మానేసిన వాళ్లకే స్థానిక ఎన్నికల్లో టిక్కెట్లు
  •  మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు
  •  మందు, డ్రగ్స్ ముట్టకోబోమని కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలతో ప్రమాణం

దండేపల్లి, వెలుగు : మద్యం మానేసిన వాళ్లకే  స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్​సాగర్​రావు పేర్కొన్నారు. కాంగ్రెస్​నేతలు, కార్యకర్తలు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ప్రజలకు ఆదర్శంగా ఉండాలని పిలుపునిచ్చారు. బుధవారం ఆయన కలెక్టర్​కుమార్​దీపక్, డీసీపీ భాస్కర్​తో కలిసి దండేపల్లిలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. సెగ్మెంట్ లోని వివిధ మండలాలకు చెందిన 500 మందికిపైగా పార్టీ నేతలు, కార్యకర్తలతో మద్యం, డ్రగ్స్ ముట్టుకోబోమని ప్రమాణం చేయించారు. 

‘ కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలమైన మేము గాంధీ జయంతి సందర్భంగా మద్యం తాగం. డ్రగ్స్ ముటుకోం.. మేము నమ్మిన దేవుని మీద ప్రమాణం చేస్తున్నాం. కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా జీవనం సాగిస్తాం. వర్గ విభేదాలు, కుల మత ద్వేషాలు, కక్షలు, గొడవలు లేకుండా అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వాములం అవుతామని దేవుని మీద ప్రమాణం చేస్తున్నాం’ అని లీడర్లు, నేతలతో  గాంధీ విగ్రహం సాక్షిగా ఎమ్మెల్యే ప్రమాణం చేయించారు. 

అనంతరం మండలంలోని లింగాపూర్​ మోడల్​స్కూల్​లో రూ.1.35 కోట్ల సీఎస్ఆర్​ఫండ్స్​తో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ట్రైబల్​డెవలప్​మెంట్​కార్పొరేషన్​చైర్మన్​కొట్నాక తిరుపతి, లక్సెట్టిపేట మార్కెట్​ కమిటీ చైర్మన్​ దాసరి ప్రేమ్​చంద్​, తహసీల్దార్లు సంధ్యారాణి, దిలీప్​కుమార్​, ఎంపీడీవో జేఆర్​ప్రసాద్​తదితరులు పాల్గొన్నారు.