నిఖార్సయిన దేశభక్తుడు మందాడి

నిఖార్సయిన దేశభక్తుడు మందాడి

తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన నేతల్లో మందాడి సత్యనారాయణరెడ్డి ఒకరు.  ప్రస్తుత జనగామ జిల్లా ఇప్పగూడెంలోని ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయనకు చిన్నప్పటి నుంచే దేశభక్తి, జాతీయ భావం ఎక్కువ. 1952లో మందాడి ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ గా ప్రస్థానం ప్రారంభించి.. 1957లో జనసంఘ్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శిగా ఎదిగారు. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. బీజేపీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసి హన్మకొండ నియోజకవర్గ శాసనసభ్యుడిగా విజయం సాధించాడు. రాజకీయ నేతగానే కాకుండా గాయకుడు, రచయిత, కవిగా మందాడిది ప్రత్యేక గుర్తింపు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సామాన్య ప్రజలకు అర్థం అయ్యేలా పాటలు రాసి అసెంబ్లీ వేదికగా పాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఒకే ఒక్క వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి. ఆయనకు మందాడి దాదాపు సమకాలికుడు. ప్రారంభంలో ఇద్దరూ జనసంఘ్​లో క్రియాశీల పాత్ర పోషించారు. తర్వాత బీజేపీలో చాలా ఎన్నికల్లో వీరిద్దరూ కలిసి పనిచేశారు. 1983 అసెంబ్లీ,1984 పార్లమెంట్​ఎన్నికల సందర్భంగా జంగారెడ్డి హన్మకొండ పార్లమెంట్​స్థానం నుంచి పోటీ చేసినప్పుడు మందాడి ఓ పాట రాసి పాడారు. 

‘‘కడుపుతో ఉన్నమ్మ కనక తప్పదురా!
బీజేపీ తెలంగాణ గెలుపు తప్పదురా..
ఈ ఊరు.. ఆ ఊరు ఏ ఊరు తిరిగినా..
బీజేపీ జంగన్నదే గెలుపు ఖాయమన్నారు’’

ప్రచార వేదికలు, సభలు, సమావేశాల్లో పాడుతూ కార్యకర్తలను, ప్రజలను ఉత్సాహరపరిచేవారు మందాడి. దాదాపు 87 వయసులోనూ ఆయన మొన్నటి మునుగోడు ప్రచారానికి కూడా వచ్చి వెళ్లారు. జయశంకర్​ నేతృత్వంలో వరంగల్​లో చేపట్టిన నాన్​ముల్కీ ఉద్యమంలోనూ మందాడి క్రియాశీల పాత్ర పోషించారు. తెలంగాణ మలి దశ పోరాటంలో మన నాయకులు కొందరు ఆంధ్రోళ్లంతా తెలంగాణ వ్యతిరేకులు అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుండటాన్ని మందాడి సహించలేదు. ఆంధ్రా రాజకీయ, పెట్టుబడిదారులే తెలంగాణకు అన్యాయం చేశారని, ప్రజలు అమాయకులు అని, మనమంతా ఈ దేశంలో భాగమేనని తెలుపుతూ ఓ పాట రాశారు.

‘‘తెలంగాణ మేలుకున్నది బంధనాలు తెంపుచున్నది
బాంధవ్యం వీడనంది.. భారతి ఒడిలోనే ఉంది.
వాగులన్నీ పొంగిపొర్లి ఒర్రెలాయే మన ఊళ్లు..
ఆనకట్టలే లేక ఆగమాయే ఆ నీళ్లు..
కృష్ణా, గోదారి నదులు.. తొక్కునిచట పరవళ్లు..
ఆయన మన భూములన్నీ అవుతున్నవిరా బీళ్లు’’

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్​నేతృత్వంలో నిరకుంశ పాలన కొనసాగుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసమానతలను, కుల వివక్షను మందాడి ఒప్పుకునేవారు కాదు. వీపీ సింగ్ ​ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో బీజేపీ రైతుల రుణ మాఫీ కోసం డిమాండ్​చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమాలు చేయాలని నిర్ణయించింది. వెంకయ్యనాయుడు తెలంగాణ మహబూబ్​నగర్​లో ఆందోళనలు ప్రారంభించగా.. మందాడి కిసాన్​ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాలోని ఓ గ్రామంలో ఉద్యమం ప్రారంభించారు. ఓ మండల కార్యకర్త ఇంట్లో భోజనం చేసి అక్కడే సమావేశం ప్రారంభించాల్సి ఉండగా.. కొందరు కార్యకర్తలు ఇంటి బయటే నిలబడి ఉన్నారు. ‘మీరు మీటింగ్​ ప్రారంభించండి సర్​.. వాళ్లు లోపలికి రారు’ అని లోపల ఉన్న ఓ పెద్ద మనిషి సలహా ఇచ్చాడు. మందాడి లేచి బయటకు వెళ్లి ఆ కార్యకర్తలను ప్రశ్నించగా.. ‘మేము ఎస్సీలం.. లోపలికి రాలేం’ అన్నారు. దీంతో ఆయన లోపల ఉన్నవాళ్లను మందలించాడు. ‘మన మనసులోనే అసమానతలు ఉంటే ప్రజలకు ఇంకేం మేలు చేయగలం’ అన్నాడు. బయటివాళ్లను లోపలికి పిలిచి.. మీటింగ్​ నిర్వహించాడు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందిన ఆయన దాన్ని కూడా ఓ పాట రూపంలో పెట్టాడు.

‘‘బొచ్చు కుక్కను తెచ్చి ముద్దెట్టుకుంటారు
 బాంచ బతుకుల వాని పొడగిట్టదంటారు
బడికి రానియ్యక.. గుడికి పోనియ్యక
అడుగడుగునా అణచి వేస్తుంటారు
అంబేద్కర్ ​ఆనాడు అనుభవించెనురా
తోటి మనవుడన్న కనికరం చూపరు
కుంటి సాకులు చెప్పి ఇంట్లోకి రానివ్వరు
ఏనాటిదీ పాపమో.. మనకెన్నాళ్లు ఈ శాపమో’’

సాధారణ కార్యకర్తగా జీవితం ప్రారంభించిన మందాడి.. చివరి వరకు ప్రజా జీవితంలోనే కొనసాగి తుది శ్వాస విడిచారు. 

-  గుజ్జుల ప్రేమేందర్​ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బీజేపీ