మనువాదుల చేతిలో మందకృష్ణ కీలు బొమ్మ

మనువాదుల చేతిలో మందకృష్ణ కీలు బొమ్మ
  •     తన స్వార్థం కోసం మాదిగలను బీజేపీకి తాకట్టు పెడుతుండు 
  •     మాలలను విమర్శించే హక్కు ఆయనకు లేదు
  •     తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ 

ముషీరాబాద్, వెలుగు: ఫూలే, అంబేద్కర్, కాన్షీరాం ఆలోచనలు, ఆశయాలు, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎమ్మార్పీఎస్​వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు మాలలను విమర్శించే హక్కు లేదని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. శుక్రవారం లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్​లో జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ చెరుకు రామచందర్, వర్కింగ్ చైర్మన్ బేర బాలకృష్ణ మాట్లాడుతూ.. మందకృష్ణ తన స్వార్థ ప్రయోజనాల కోసమే మాదిగల ఆత్మగౌరవాన్ని బీజేపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తాకట్టు పెట్టారని విమర్శించారు. 

ఆయన చెబితే ఇక్కడ వినేవాళ్లు ఎవరూ లేరన్నారు. మనువాదుల చేతిలో కీలు బొమ్మగా మారిన మందృకృష్ణ, కిషన్ రెడ్డికి బినామీగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 30 ఏండ్లుగా దళితులను రాజకీయంగా ఎదగకుండా మోసం చేశాడని, మాల, మాదిగల గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదని చెప్పారు. ప్రస్తుతం మాదిగ ఉపకులాల అభివృద్ధికి అడ్డం పడుతున్నాడని, ఆయన అభివృద్ధే.. అందరి అభివృద్ధి ఎలా అవుతుందని ప్రశ్నించారు. 

జి.వెంకటస్వామి, మల్లు అనంత రాములు కుటుంబాల మీద ఏడుపు ఆపాలని సూచించారు. దళిత ప్రజానీకం మందకృష్ణ, బీజేపీ నిజస్వరూపం గ్రహించాలని కోరారు. లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న కిషన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఒడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని, ఒక్క సీటు కూడా గెలవనీయబోమని చెప్పారు. సమావేశంలో జేఏసీ నాయకులు నాను, ఉత్తం సుమన్, సత్యనారాయణ, ప్రభాకర్, శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.