కొంత ప్రేమ, గుర్తింపు చాలు! : మండల కృష్ణ

కొంత ప్రేమ, గుర్తింపు చాలు!  : మండల కృష్ణ

ఇంకెంత కాలం ఆమెను నిర్బంధించాలనుకుంటున్నారు. ఆమెప్పుడో ఈ ప్రపంచాన్ని చుట్టేసింది. కనుసైగతో ఈ జగత్తును ఏలుతోంది. ఆమె ఇప్పుడు నిర్బంధంలో ఉన్న అవని కాదు. తన ఆలోచనలను ఈ విశ్వాన్నంతా వ్యాపింపజేసింది. తరాలుగా తన స్వేచ్ఛను, భావ వ్యక్తీకరణను తొక్కిపట్టి.. ఆడదంటే వంటింటి అలంకారంగానే పరిగణించిన ఈ సమాజంలో.. తాను సంకెళ్లను తెంచుకొని బయట ప్రపంచంలోకి వచ్చింది. 

మగాడంటే సంపాదించాలి. ఆడదంటే ఇల్లును సక్కబెట్టాలనే నానుడిని తన ఎడమకాలి కింద నొక్కి పట్టి ఈ ప్రపంచానికి సరికొత్త నిర్వచనం ఇచ్చింది. తాను ఎందులోనూ తీసిపోనంటూ మగ అహంకారానికి ముకుతాడు వేసింది. తల్లిగా, చెల్లిగా, అమ్మగా, అక్కగా,  భార్యగా మానవాళికి ప్రేమను పంచుతూ తాను కోరుకున్న లక్ష్యంవైపు వేల యుద్ధాలు గెలుస్తూ వెళ్తోంది. ఎన్నిరోజులు ఈ వివక్ష. తానూ మనిషినేనంటూ వక్రబుద్ధిపై కత్తిసాము చేస్తోంది. 

తాను లేనిదే ఈ భూమి లేదని సవాల్ చేస్తోంది.  వందల ఏండ్ల  సంఘర్షణకు ఒక్కరోజు కేటాయించి సత్కారాలు, సన్మానాలు, పొగడ్తలతో ముంచెత్తితే స్త్రీ సాధికారత లభించినట్టేనా. మరేం కావాలి ఆమెకు... ఆమెకు కావాల్సింది కాస్త ప్రేమ! మాటకు విలువ నిచ్చే మనుషులు! తాను చేసిన పనికి గుర్తింపు! చేయాలనుకున్న పనులకు సపోర్ట్!.  దీని కోసమే.. ఏండ్లుగా ఆమె మనసు బద్ధలయ్యేది. వీటి కోసమే కంటికి కనిపించని యుద్ధాలు చేసేది. వీటికోసమే ఆమె జీవితమంతా త్యాగం చేసింది. స్త్రీ సాధికారత, సమానత్వం లాంటి పెద్ద పెద్ద పదాలు ఆమెకు అవసరం లేదు. విశ్వానికి  ప్రేమను పంచుతోంది. 

-  మండల కృష్ణ,సీనియర్ జర్నలిస్ట్