తెలంగాణలోని వైకల్యాలను తొలిదశలో గుర్తించేందుకు ‘ప్రశస్త్’ స్క్రీనింగ్

తెలంగాణలోని వైకల్యాలను తొలిదశలో గుర్తించేందుకు ‘ప్రశస్త్’ స్క్రీనింగ్
  •     ఈనెల 7న అన్ని బడులు, కాలేజీల్లో ఓరియంటేషన్
  •     స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని  సర్కారు, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ఈనెల7న ‘ప్రశస్త్’ సెన్సిటైజేషన్ ఓరియంటేషన్ మాడ్యూల్‌‌ను తప్పనిసరిగా ప్రదర్శించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. పిల్లల్లో ఏవైనా వైకల్యాలు ఉంటే ప్రారంభ దశలోనే గుర్తించి తగిన సహాయం అందించేందుకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అనుకూలమైన విద్యా వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా కేంద్ర విద్యాశాఖ  30 నిమిషాల ప్రత్యేక మాడ్యూల్‌‌ను రూపొందించిందని తెలిపారు. 

ఈ మేరకు ఆయన డీఈఓలకు ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఓరియంటేషన్ మాడ్యూల్  మొత్తం 12 భారతీయ భాషల్లో అక్టోబర్ 7 నుంచి అధికారిక పోర్టల్ (https://prashast.education.gov.in/)లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. హెడ్మాస్టర్లు తమ హెచ్‌‌ఎం లాగిన్ ద్వారా పోర్టల్‌‌లోకి వెళ్లి, వీడియో ట్యుటోరియల్ ఆప్షన్ ద్వారా దీనిని వీక్షించవచ్చని స్పష్టం చేశారు. టీచర్లతో పాటు నాన్-టీచింగ్, సపోర్టింగ్ స్టాఫ్, ఆయాలు, డ్రైవర్లు, అటెండర్లు, క్లరికల్ సిబ్బంది, వార్డెన్లు, రిసెప్షనిస్టులు అందరికీ దీనిని చూపించాలని స్పష్టం చేశారు. ఈ వీడియో మాడ్యూల్‌‌ను ఎన్ని స్కూళ్లు చూశాయనే వివరాలు జాతీయ, రాష్ట్ర, బ్లాక్ స్థాయి లాగిన్‌‌లలో నమోదవుతాయని తెలిపారు.