పులి ఉందని భయపెట్టి దోపిడీ..

పులి ఉందని భయపెట్టి దోపిడీ..

గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు

కొండల నడుమ అక్రమ దందా

అంటీముట్టనట్లుగా అధికారులు

ఆదిలాబాద్,​ వెలుగు: అద్భుతమైన మాంగనీస్ నిక్షేపాలు. సొంతం చేసుకోవాలని స్కెచ్ వేశారు. ‘అదిగో పులి.. అటువైపు ఎవరూ పోవద్దు’ అంటూ జనాల్ని భయపెట్టారు. సోషల్​ మీడియాలోనూ జోరుగా ప్రచారం చేశారు. ఆపై మూడో కంటికి తెలియకుండా అక్రమార్కులు పని ముగించుకుంటున్నారు. అలా ఏకంగా వందల ఎకరాలకు గండి కొడుతున్నరు. మాంగనీస్ నిక్షేపాలు తవ్వి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. టైం టు టైం అధికారులకు అందాల్సినవి అందుతుండటంతో వాళ్లూ లైట్ తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గూడ ప్రాంతంలో జరుగుతోందీ తతంగం.

అక్రమార్కుల ఎత్తుగడలు

ఎక్కడెక్కడ మాంగనీస్​ నిక్షేపాలున్నాయో గుర్తించి వ్యాపారులు ఆ భూములను నయానో బయానో రైతుల నుంచి తీసుకుని ఖనిజాలు తవ్వేస్తున్నారు. ఇంకొందరు వ్యాపారులు.. మాంగనీస్​ తవ్వితే భూమి సారవంతంగా మారుతుందని ప్రచారం చేస్తూ అమాయక రైతుల నుంచి భూమిని లీజుకు తీసుకుంటున్నారు. ఇందులో ఒక డబ్బానిండా మాంగనీస్​ తీసినందుకు ₹ 200 ఇస్తామని చెప్పి రైతును కూలీ పనికి వాడుతున్నారు. మార్కెట్ లో ₹6 వేలకు అమ్ముడుపోయే ఒక టన్ను మాంగనీసు తీసినందుకు రైతుకు ₹600 ముట్టజెప్పి దండుకుంటున్నారు. అంతకుముందు కొందరు వ్యాపారులు తాంసి మండలలోని కొన్ని ప్రాంతాలను( సర్వేనెంబర్​ 27, 29, 35, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51) లీజుకు తీసుకుని కొంత కాలం టైం బాండ్ తో తవ్వకాలకు అనుమతి పొందారు. అయితే ఇప్పటి వరకూ అవే అనుమతులను చూపిస్తూ నిక్షేపాలను తరలించుకుంటున్నారు.

సర్కారు ఖజానాకు గండి

మాంగనీస్ నిల్వలు ఉన్నాయా లేవా అని తెలుసుకునేందుకు అధికారులు ప్రొస్పటింగ్​ లైసెన్స్(పీఎల్​)ను తొలుత జారీచేస్తారు. ఆ లైసెన్స్ పొందినవారు ఆయా భూముల్లో ఖనిజ నిక్షేపాలున్నాయా.. లేదా అనేది మాత్రమే తెలుసుకోవాలి. సాంపిల్స్ కోసం కొద్దిగా తవ్వి వాటిని పరీక్షలకు పంపాల్సి ఉంటుంది. అంతవరకే పీఎల్ లైసెన్స్ అనుమతిస్తుంది. ల్యాబ్ లో టెస్టుల తర్వాత ఆ భూమిలో ఖనిజాలుంటాయని అధికారులు నిర్ధారించిన మీదట తవ్వకాలకు అనుమతిస్తారు. కానీ, వ్యాపారులు పీఎల్ ను చూపించి వందలాది ఎకరాల్లో నిక్షేపాలను తవ్వేస్తున్నారు. అయితే తవ్విన ఖనిజాలను అమ్మేందుకు కూడా మరో లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. కానీ తవ్వకాలు కానిచ్చేసి.. లైసెన్స్ ఉన్న వారి పేరిట అక్రమంగా అమ్మకాలు చేపడుతున్నారు.

దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది. దీనిపై అధికారులు కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. వారికి కూడా కావాల్సినంత కమిషన్ ముడుతుండడంతోనే పట్టించుకోవట్లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొండప్రాంతాల్లోని కొన్ని భూముల్లో మాంగనీస్​ తవ్వకాలు జరిపే సంగతి కూడా సంబంధిత రైతుకు చెప్పడంలేదు. రైతు ఆ వైపు వెళ్లనప్పుడు చూస్తే తన భూమంతా లొందలమయంగా ఉండటంతో లబోదిబో మనడం తప్ప చేసేదేమీ ఉండట్లేదు. ఇలాగే ఒకరిద్దరు భూములను ఇష్టారీతిన తవ్వడంతో రైతులు కోర్టులను ఆశ్రయించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆదిలాబాద్​ మండలం జందాపూర్​ గ్రామానికి చెందిన చిల్కూరి తిరుపతి అనే వ్యక్తి తనకు తెలియకుండానే తన భూమిని తవ్వారని కోర్టుకెక్కారు.

మూడో కంటికి తెలియకుండా..

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు, బజార్​హత్నూర్​ మండలాల్లో పులి సంచారం ఉన్న మాట నిజమే. ఒకట్రెండు ఆవులు, మేకలను చంపిన ఘటనలూ ఉన్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. దీన్ని అదునుగా తీసుకున్న అక్రమార్కులు జైనథ్ మండలంలో మాంగనీస్ నిక్షేపాలున్న ప్రాంతంలోనూ పులి తిరుగుతోందంటూ ప్రచారం చేశారు. పులి భయంతో స్థానికులెవరూ అటువైపు వెళ్లకపోవడంతో వ్యాపారస్తులకు అడ్డు లేకుండా పోయింది. ఇంకేముంది.. వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలు అన్న చందంగా నడుస్తోంది. భారీ జేసీబీలు, ప్రొక్టేనర్లతో తవ్వకాలు జరుపుతున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీల్లో మాంగనీస్ ను ఫ్యాక్టరీలకు ట్రాన్స్ పోర్టు చేస్తున్నరు.

ఊళ్లో ఉన్న మాకే తెల్వదు

మా ఊరు పక్కనే ఉండే గుట్ట దగ్గర మాంగనీస్ రాళ్ల కోసం తవ్వకాలు జరుపుతున్నరు. నేనే అక్కడకు వెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నించిన. మాకన్ని పర్మిషన్లు ఉన్నయని చెప్పిన్రు. ఉల్టా నన్నే దబాయించిన్రు. తీరా గట్టిగా అడిగేసరికి ఖనిజాలను తవ్వేందుకు ఎటువంటి పర్మిషన్ పేపర్లు లేవని తెల్సింది. – ప్రభాకర్​, గూడ సర్పంచ్​

ఎవరికీ అనుమతివ్వలే

జానెడు భూమికి కూడా ఖనిజాలు తవ్వేందుకు అనుమతివ్వలేదు. జైనథ్​ మండలం గూడ పరిసరాల్లో ఖనిజాల తవ్వకాలు జరుగుతున్నట్లు ఇప్పుడే తెలిసింది. వెంటనే అక్కడికెళ్లి తవ్వకాలను అడ్డుకుంటాం. అందుకు బాధ్యులపై కేసులు పెడతాం.

                                                                                                                    – సూర్యనారాయణ, ఆర్డీవో, ఆదిలాబాద్