TVVP, EHS, ఆరోగ్యశ్రీ​లో ఎన్నాళ్లీ ఇన్​చార్జ్​ పాలన?

TVVP, EHS, ఆరోగ్యశ్రీ​లో ఎన్నాళ్లీ ఇన్​చార్జ్​ పాలన?
  • అటు హైదరాబాద్​ కలెక్టర్​గా..ఇటు మూడు విభాగాలకు ఇన్​చార్జ్​గా మాణిక్​రాజ్​
  • సంతకాల కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న వైద్య శాఖ అధికారులు
  • ఆగిన ఇంక్రిమెంట్లు ..ముందుకు సాగని ప్రమోషన్లు

హైదరాబాద్‌‌, వెలుగు:

వైద్యారోగ్యశాఖలోని కీలక విభాగాలకు ఇన్​చార్జులే దిక్కవుతున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌‌ (టీవీవీపీ), ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌‌ఎస్‌‌.. ఈ మూడు విభాగాల్లో కొన్నాళ్లుగాఇదే పరిస్థితి నడుస్తోంది. ఒక వైపు హైదరాబాద్​ కలెక్టర్​గా కొనసాగుతూనే మరోవైపు టీవీవీపీకి ఇన్​చార్జ్​ కమిషనర్​గా, ఆరోగ్యశ్రీకి ఇన్​చార్జ్​ సీఈవోగా, ఈహెచ్​ఎస్​కు ఇన్​చార్జ్​ ఈసీవోగా ఐఏఎస్​ అధికారి మాణిక్​రాజ్​ వ్యవహరిస్తున్నారు. జిల్లా, ఏరియా దవాఖాన్లు, కమ్యూనిటీ హెల్త్‌‌ సెంటర్ల పరిపాలన విభాగమైన వైద్య విధాన పరిషత్​కు పూర్తి స్థాయి కమిషనర్​ లేకపోవడంతో పరిపాలన గాడి తప్పుతోందన్న విమర్శలు ఉన్నాయి. పదిహేను రోజుల క్రితం భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సహా ముగ్గురు డాక్టర్లు.. డ్యూటీ అవర్స్‌‌లో  ప్రైవేటు ప్రాక్టీస్‌‌కు వెళ్లిన ఘటన బయటపడింది. ఖమ్మంలో బాలింతలకు సెక్యూరిటీ సిబ్బంది సెలైన్ పెట్టిన ఘటన సంచలనమైంది. మిగతా దవాఖాన్లలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. విధులకు గైర్హాజరవుతున్న 130 మందికిపైగా డాక్టర్లకు ఇటీవలే నోటీసులు కూడా ఇచ్చారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోనే దవాఖాన్లలో సూపరింటెండెంట్‌‌ల నుంచి డాక్టర్లు, అధికారులు వరకు విధులను నిర్లక్ష్యం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పూర్తిస్థాయి కమిషనర్‌‌‌‌ లేకపోవడంతో టీవీవీపీలోని కొందరు ఉన్నతాధికారులు కూడా ఎవరికి వారే స్వతంత్రులుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీవీవీపీకి కొత్త కమిషనర్‌‌‌‌ను నియమించాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌కు డాక్టర్లు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. పూర్తి స్థాయి కమిషనర్‌‌‌‌ లేకపోవడంతో తమ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఆగిపోయాయని వివరించారు. ముఖ్యమైన పోస్టు కావడంతో, సీఎం కేసీఆర్‌‌‌‌ చూసుకుంటారని మంత్రి బదులిచ్చినట్టు డాక్టర్లు తెలిపారు.

నేటికీ ఆయనే..

ఏకకాలంలో టీవీవీపీ కమిషనర్‌‌‌‌గా, ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌‌ఎస్‌‌ ఇన్​చార్జ్ సీఈవోగా పనిచేసిన ఐఏఎస్‌‌ అధికారి మాణిక్​రాజ్‌‌ ఫిబ్రవరిలో హైదరాబాద్‌‌ కలెక్టర్‌‌‌‌గా బదిలీ అయ్యారు. 4 నెలలు కావొస్తున్నా ఇప్పటికీ ఈ మూడు పోస్టుల్లోనూ ఆయనే కొనసాగుతున్నారు. మూడు విభాగాల అధికారులు ఫైళ్లు పట్టుకుని హైదరాబాద్‌‌ కలెక్టరేట్‌‌కు వెళ్తున్నారు. అక్కడ ఆయన సమయమిచ్చే వరకూ పడిగాపులుగాచి సంతకం పెట్టించుకొని వస్తున్నారు. వీవీపీ పరిధిలో సుమారు 3 వేల మంది డాక్టర్లు పనిచేస్తున్నారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల విషయమై కమిషనర్​ను కలిసి విన్నవిద్దామని వెళ్లే డాక్టర్లకు నిరాశే ఎదురవుతోంది. ప్రస్తుతం మాణిక్కరాజ్‌‌ సెలవులో ఉండగా, కనీసం ఇన్​చార్జ్ బాధ్యతలు కూడా ఎవరికీ ఇవ్వకపోవడం గమనార్హం.

నిబంధనలకు విరుద్ధంగా..

నిబంధనల ప్రకారం టీవీవీపీ కమిషనర్‌‌‌‌గా డాక్టర్​నే నియమించాలి. కానీ మాణిక్​రాజ్‌‌ను నియమించారు. దీంతో డాక్టర్లు హైకోర్టులో పిల్ వేశారు. వెంటనే ఐఏఎస్‌‌ అధికారి(మాణిక్​రాజ్‌‌)ని తొలగించి, వారం రోజుల్లో డాక్టర్‌‌‌‌ను కమిషనర్‌‌‌‌గా నియమించాలని కోర్టు ఫిబ్రవరిలో తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోనే మాణిక్కరాజ్‌‌ను హైదరాబాద్‌‌ కలెక్టర్‌‌‌‌గా బదిలీ చేశారు. కానీ, టీవీవీపీ కమిషనర్​గా కొత్తవారిని నియమించలేదు. దీంతో డాక్టర్లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌‌ విచారణకు రావాల్సి ఉంది.