విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్ కి ఫిర్యాదు చేసిన మాణిక్కం ఠాకూర్

 విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్ కి ఫిర్యాదు చేసిన  మాణిక్కం ఠాకూర్

వైసీసీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై రాజ్యసభ చైర్మన్ కి ఫిర్యాదు చేశారు ఏపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాకూర్ . ఫిబ్రవరి 05వ తేదీన రాజ్యసభలో తన గురించి అనవసరంగా విజయసాయిరెడ్డి  మాట్లాడారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.  లోక్ సభ సభ్యుడి గురించి రాజ్యసభలో మాట్లాడటం సభా హక్కుల కిందకు వస్తుందన్నారు మాణిక్కం ఠాకూర్.  

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది మోదీనే అని.. మరి ఆ హామీ గురించి విజయసాయిరెడ్డి ఆయన్ను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు మాణిక్కం ఠాకూర్. ప్రత్యేక హోదాపై జగన్ మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు.  2019 నుంచి పార్లమెంట్ లో దాదాపు అన్ని బిల్లులు జగన్ మద్దతుతోనే ఆమోదం పొందాయన్నారు మాణిక్కం ఠాకూర్.  కొత్త పార్లమెంటు భవనం ప్రారంభానికి అన్ని విపక్షాలు బాయ్ కట్ చేస్తే.. జగన్ మాత్రం హాజరయ్యారని గుర్తుచేశారు.  

ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి 15 సార్లు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నది జగన్ పార్టీనే అని  మాణిక్కం ఠాకూర్  అన్నారు.  సభలో బిల్లులకు మద్దతు ఇచ్చి బయటికి వచ్చి వ్యతిరేకంగా మాట్లాడుతారంటూ విమర్శించారు.  జగన్ ... బీజేపీకి ఏటీఎంలా మారారని ఆరోపించారు.  కేవలం విజయసాయిరెడ్డి, జగన్ వ్యక్తిగత అవసరాలు, సీబీఐ కేసుల కోసమే బీజేపీకి లొంగిపోయారన్నారు.