
- కష్టపడినోళ్లకే టికెట్లు.. సర్వేల ఆధారంగానే ఇస్తం
- పరిచయాలు ఉన్నంత మాత్రాన టికెట్లు రావు
- పని చేయలేకపోతే తప్పుకోవాలని అల్టిమేటం
- క్రమశిక్షణతో ఉండండి.. నేతలకు మాణిక్ ఠాక్రే వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే వార్నింగ్ ఇచ్చారు. పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. పార్టీలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. కష్టపడి పనిచేసినోళ్లకే టికెట్లు ఇస్తామని, పదవుల్లో ఉండి పనిచేయనోళ్లపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సర్వేల ఆధారంగానే టికెట్లు దక్కుతాయన్నారు. సోమవారం హైదరాబాద్ గాంధీభవన్‌లోని ప్రకాశం హాల్లో నిర్వహించిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోసం ఇప్పట్నుంచే సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. బాధ్యతలు అప్పగించిన తర్వాత అందుకు తగినట్టుగా పనిచేయాలని, చేయలేకపోతే తప్పుకోవాలని స్పష్టం చేశారు. ‘‘బాధ్యతగా పనిచేయని వాళ్లను ఉపేక్షించే ప్రసక్తే లేదు. పరిచయాలున్నంత మాత్రాన టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు” అని అన్నారు. కర్నాటకలో కష్టపడినందుకే గెలిచామని, తెలంగాణలోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని సమస్యలపై అన్ని స్థాయిల్లో పోరాడాలని కేడర్‌కు సూచించారు. కాంగ్రెర్‌కు మాత్రమే వ్యతిరేకంగా కేసీఆర్ పనిచేస్తున్నారని ఆరోపించారు. బీజేపీతో ఫ్రెండ్లీగా ఉన్నారని, ఆ తెరచాటు స్నేహాన్ని ప్రజలకు వివరించాలన్నారు.
యూత్ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకుపోదాం
కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో.. ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలపై కేడర్‌కు నేతలు దిశానిర్దేశం చేశారు. రైతు డిక్లరేషన్ మాదిరిగానే ప్రియాంక గాంధీ ప్రారంభించిన యూత్ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేలా తీర్మానం చేశారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఊరూరా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ పోటీలకు 100 నియోజకవర్గాల్లో కనీసం 25 లక్షల మందిని నమోదు చేయించేలా క్షేత్ర స్థాయిలో పని చేయాలని సూచించారు. గతంలో నిర్వహించిన ఆన్లైన్ పార్టీ సభ్యత్వాలు 43 లక్షలు దాటాయని, ఇప్పుడూ అదే స్ఫూర్తితో సభ్యత్వ నమోదు కోసం పనిచేయాలని సూచించారు. కర్నాటకలో గెలిచినందుకు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ను అభినందిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు. రాజీవ్ గాంధీ క్విజ్ పోటీలకు సంబంధించి పార్టీ సోషల్ మీడియా విభాగం చైర్మన్ సతీశ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏఐసీసీ ప్రచార కమిటీ చైర్మన్మధుయాష్కీ, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, రోహిత్ చౌదరి, నదీమ్ జావెద్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
విభేదాలు సమసిపోయినయ్: రేవంత్
దేశాన్ని మత ప్రాతిపదికన విడగొట్టి అధికారాన్ని పదిలం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. అందుకే దేశాన్ని కలిపి ఉంచేందుకు భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ చేశారన్నారు. ప్రజల సంపదను అదానీ, అంబానీకి బీజేపీ కట్టబెట్టిందని, దానిపై ప్రజల పక్షాన రాహుల్ పోరాడుతున్నారని తెలిపారు. ‘‘అధికారం ఉందని విర్రవీగిన మోడీకి.. కర్నాటక ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అందరం కలసికట్టుగా పనిచేస్తే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం” అని చెప్పారు. పేదల పక్షాన నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. పార్టీలో ఎవరూ కోవర్టులు లేరని, విభేదాలూ సమసిపోయాయని రేవంత్ చెప్పారు. పార్టీ కోసం తాను పది మెట్లు దిగేందుకైనా సిద్ధమన్నారు.