మణిపూర్​లో హత్యకు గురైన విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన

మణిపూర్​లో హత్యకు గురైన విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన

ఇంఫాల్: కనీసం తమ పిల్లల అస్థికలైనా ఎక్కడున్నాయో గుర్తించి, తెచ్చివ్వాలని మణిపూర్​లో హత్యకు గురైన ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు. "మా పిల్లలను చివరి సారిగా చూడాలనుకుంటున్నాం. గౌరవంగా అంత్యక్రియలు చేయాలనుకుంటున్నాం. 

మా ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలంటే  వారు చివరిసారి ధరించిన దుస్తుల చిన్న ముక్క అయినా ఉండాలి" అని మృతుల తల్లిదండ్రులు గురువారం అధికారుల వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఏడాది జులైలో కన్పించకుండా పోయిన అమ్మాయి, అబ్బాయి డెడ్​బాడీల ఫొటోలు ఇటీవల సోషల్​ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అయితే, ఇప్పటివరకు వారి మృతదేహాలను మాత్రం గుర్తించలేకపోయారు. 

ఈ ఘటనతో మణిపూర్​లో మరోసారి అల్లర్లు మొదలయ్యాయి. విద్యార్థుల హత్యను నిరసిస్తూ గురువారం తెల్లవారుజాము దాకా భారీ ఎత్తున ఆందోళనలు జరిగాయి. పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక గుంపు డిప్యూటీ కమిషనర్​ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది. రెండు వెహికల్స్​ను తగులబెట్టింది. సుమారు 65 మందికి పైగా గాయపడ్డారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు విధించారు.

 కాగా,  సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)  పొడిగింపు మణిపూర్ సంక్షోభానికి పరిష్కారం కాదని హక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల అన్నారు. మణిపూర్ ప్రభుత్వం ఈ ప్రాంత వైవిధ్యాన్ని గౌరవించాలని ఆమె అన్నారు. మరోవైపు మణిపూర్​లో అల్లర్ల నేపథ్యంలో మణిపురి నటుడు రాజ్‌కుమార్ సోమేంద్ర బీజేపీకి రాజీనామా చేశారు. అల్లర్లు, విద్యార్థుల హత్య పట్ల ప్రభుత్వం అసమర్థంగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు.  'పబ్లిక్ ఫస్ట్.. పార్టీ సెకండ్' అనేది నా ఉద్దేశమని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

శ్రీనగర్​ ఎస్పీ మణిపూర్​కు బదిలీ

మణిపూర్​లో ప్రస్తుత అల్లర్ల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీనగర్ లో సీనియర్ ఎస్పీగా పని చేస్తున్న రాకేష్ బల్వాల్‌ను తన సొంత కేడర్​మణిపూర్ కు బదిలీ చేయాలని నిర్ణయించింది.  గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఘర్షణల కట్టడికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.