మణిపూర్ ఘటన.. ఆ రోజు ఏం జరిగిందంటే..

మణిపూర్ ఘటన.. ఆ రోజు ఏం జరిగిందంటే..

ఇంఫాల్:మణిపూర్‌లో ఇద్దరు మహిళలను ఓ గుంపు నగ్నంగా ఊరేగిస్తూ.. అసభ్యకరంగా తాకుతూ.. కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారిపై సామూహిక అత్యాచారానికీ పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారంటూ ఫేక్ వీడియో విడుదల కావడం వల్లే.. ఆ వర్గం వాళ్లు ప్రత్యర్థి వర్గానికి చెందిన మహిళలపై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తున్నది. అయితే, ఇంఫాల్‌కు 35 కిలో మీటర్ల దూరంలోని కాంగ్‌పోప్కి జిల్లాలో మే 4న ఈ ఘటన జరిగింది. ఇప్పుడు మహిళల నగ్న ఊరేగింపునకు సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నది. మణిపూర్‌లో మే 3 నుంచి ఇంటర్నెట్‌ వినియోగంపై నిషేధం ఉంది. అందుకే ఇన్ని రోజులు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బయటకు రాలేదని తెలుస్తున్నది. రెండు నెలలుగా మెజార్టీ వర్గమైన మైతీలు, కొండ ప్రాంతాల్లో నివసించే కుకీ తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే, మే 4న ఏం జరిగిందనే దానిపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి.


అడ్డగించి.. చితకబాదిన గుంపు
మణిపూర్‌లో మే 3న మైతీ, కుకీ తెగల మధ్య హింస చెలరేగింది. దీంతో ఇంఫాల్‌కు 35 కిలో మీటర్ల దూరంలోని కాంగ్‌పోప్కి జిల్లా ఘర్షణలు జరిగాయి. తమ వర్గానికి చెందిన ఓ మహిళపై అత్యాచారం చేశారన్న ప్రచారంతో కొందరు యువకులు మరో వర్గానికి చెందిన గ్రామాలపై దాడులు ప్రారంభించారు. తమ గ్రామంపై దాడి జరుగుతుందని భావించిన ఓ కుటుంబం అడవిలోకి బయలుదేరింది. వీరిలో 50 ఏండ్ల వ్యక్తి, అతని 19 ఏండ్ల కొడుకు, 21 ఏండ్ల బిడ్డతో పాటు 42, 52 ఏండ్ల ఇద్దరు మహిళలు ఉన్నారు.  అదే టైంలో నాంగ్​పోక్ సెక్​మై వద్ద వారికి పోలీసులు కనిపించారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఐదుగురు వాళ్ల దగ్గరికెళ్లారు. అంతలోనే 800 నుంచి 1,000 మంది గుంపు వాళ్లను అడ్డగించి దాడికి పాల్పడింది. తన అక్కను రక్షించేందుకు 19 ఏండ్ల తమ్ముడు ప్రయత్నించగా.. అతనితో పాటు 50 ఏండ్ల తండ్రి అల్లరిమూక దాడిలో చనిపోయారు.  ఆ తర్వాత, 21 ఏండ్ల యువతితో పాటు 42 ఏండ్ల మహిళ బట్టలు ఊడదీశారు. నగ్నంగా ఊరేగిస్తూ.. అసభ్యకరంగా తాకుతూ.. కొడుతూ.. పొలాల్లోకి లాక్కెళ్లారు. అందులో ఒకరిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది. 


మే 18న జీరో ఎఫ్ఐఆర్ నమోదు
మే 18న బాధిత కుటుంబం, బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి.. మే 21వ తేదీన నాంగ్​పాక్​సెక్​మై పోలీస్ స్టేషన్​కు కేసు ట్రాన్స్​ఫర్ చేశారు. మే 4న చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో జులై 19న సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ ఘటనకు సంబంధించి హెరాదాస్‌ (32) అనే ప్రధాన నిందితుడిని, మరో ముగ్గురిని పోలీసులు రెండు నెలల తర్వాత గురువారం అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. వీడియోలోని వారిని గుర్తించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు.


పోలీసులే గుంపు దగ్గర వదిలేశారు: బాధిత యువతి
రక్షించాలని పోలీసుల వద్దకు వెళ్తే.. వారే తమను గుంపు వద్దకు వదిలి వెళ్లిపోయారని 21 ఏండ్ల బాధితురాలు వివరించింది. నగ్నంగా ఊరేగిస్తూ, కొడ్తున్నా.. పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించింది. పొలాల్లోకి లాక్కెళ్లి కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపింది. ప్రాణాలు కాపాడుకునేందుకు అడవిలోకి వెళ్తున్నప్పుడే ఇదంతా జరిగిందని ఎఫ్ఐఆర్​లో చెప్పింది. ‘‘మా గ్రామంపై దాడి చేస్తున్న గుంపుతో పోలీసులున్నారు. మమ్మల్ని ఇంటి నుంచి పికప్ చేసుకుని.. ఊరికి కొంచెం దూరంగా తీసుకెళ్లి గుంపు వద్ద రోడ్డుమీద వదిలేశారు. గుంపులోని కొందరు నాన్నను, తమ్ముడిని చంపేశారు. నాతో ఏం చేయాలో అది చేశారు. వాళ్లు వెళ్లిపోయాక అక్కడి నుంచి పారిపోయి వచ్చా. నగ్నంగా ఊరేగిస్తున్నప్పుడు వీడియో తీసింది కూడా నాకు, నా ఫ్యామిలీకి తెలియదు. గుంపులో చాలా మంది ఉన్నారు. గుంపులో ఉన్న నా తమ్ముడి ఫ్రెండ్​ను మాత్రం గుర్తుపడ్తాను” అని 21 ఏండ్ల బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది.