
మణిపూర్‌లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. బిష్ణుపూర్ ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘటనలో ముగ్గురు మృతిచెందారు. హరోథెల్, సెంజామ్ చిరాంగ్ ప్రాంతాల్లో ఒక భద్రతా సిబ్బంది సహా ఇద్దరు వ్యక్తులకు బుల్లెట్ గాయాలయ్యాయి. భద్రతా బలగాలు కొండ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కౌత్రుక్ కొండ శ్రేణిలోని ఏడు అక్రమ బంకర్లను ధ్వంసం చేశాయి. ఫౌగాక్‌చావో ఇఖాయ్‌లో దాదాపు 600 మందితో కూడిన అల్లరి మూక విధ్దంసం సృష్టించేందుకు ప్రయత్నించగా.. భద్రతా దళాలు గుంపును చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాయి. 25 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
భద్రతా చర్యల్లో భాగంగా మణిపూర్‌లోని వివిధ జిల్లాల్లో కొండ, లోయలో మొత్తం 129 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉల్లంఘించిన 1,047 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిష్ణుపూర్ జిల్లాలోని ఐఆర్‌బి, నారన్‌సీనా, కీరెన్‌ఫాబి పోలీస్ అవుట్‌పోస్ట్, తంగలవాయి పోలీస్ అవుట్‌పోస్టులపై అల్లరి మూక దాడి చేసి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని ఎత్తుకెళ్లింది. వికృత గుంపు 7 బిఎన్ నుంచిఆయుధాలు, మందుగుండు సామగ్రిని లాక్కోవడానికి కూడా ప్రయత్నించింది. మణిపూర్ రైఫిల్స్ రెండో బ్రాంచ్, మణిపూర్ రైఫిల్స్, హీంగాంగ్ పోలీస్ స్టేషన్, సింజమీ పోలీస్ స్టేషన్లపై అల్లరి మూక దాడులను భద్రతా దళాలు తిప్పికొట్టాయి.
మరోవైపు మణిపూర్ లో కొనసాగుతున్న హింస, గందరగోళంపై చర్చించేందుకు అసెంబ్లీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని మణిపూర్ కాంగ్రెస్ గవర్నర్ ను కోరింది. రాష్ట్రంలో శాంతి ని పునరుద్దరించేందుకు అసెంబ్లీ సరైన వేదిక అని మణీపూర్ కాంగ్రెస్ నేతలు తెలిపారు. మేలో చెలరేగిన జాతి హింస గత మూడు నెలలుగా మణిపూర్‌లో కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.