మరో నిందితుడు అరెస్ట్.. దేశవ్యాప్తంగా ఆగని నిరసనలు

మరో నిందితుడు అరెస్ట్.. దేశవ్యాప్తంగా ఆగని నిరసనలు

కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు సంబంధించి మరో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని యుమ్లెంబమ్ నుంగ్సితోయ్ మెటీ (19)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. దేశాన్ని కుదిపేసిన ఈ కేసులో ఇప్పటి వరకు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

మణిపూర్‌లోని కాంగ్‌పోక్పిలో ఒక వర్గానికి మద్దతుగా పోరాడిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేయడమే గాక, వారిని ఊరంతా ఊరేగించే ఓ వీడియో ఇటీవలే బయటపడింది. ఇది యావత్ దేశాన్ని భారీ షాక్‌కు గురయ్యేలా చేసింది. ఈశాన్య రాష్ట్రంలో హింస చెలరేగిన ఒక రోజు తర్వాత కాంగ్‌పోక్పి జిల్లాలో మే 4న ఈ సంఘటన జరిగింది.

ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన నలుగురిని ఇప్పటికే రిమాండ్ కు పంపినట్టు పోలీసులు తెలిపారు. 26 సెకన్ల ఈ వీడియో జూలై 19న బయటికి రాగా.. ఇది జరిగిన ఒక రోజు తర్వాత అరెస్టులు ప్రారంభమయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అధికారులు అదుపులోకి తీసుకున్న కొన్ని గంటలకే ఆ గ్రామంలోని కొందరు అతని ఇంటికి నిప్పు పెట్టారు. ఇదిలా ఉండగా వీడియోలో కనిపించిన మహిళల్లో ఒకరు భారత సైన్యంలో అస్సాం రెజిమెంట్‌కు సుబేదార్‌గా పనిచేసి, కార్గిల్ యుద్ధంలో పోరాడిన మాజీ సైనికుడి భార్య కావడం గమనార్హం.