నేను జైలుకెళ్లినా ఎన్నికల ప్రచారం మాత్రం ఆగదు : మనీశ్ సిసోడియా

నేను జైలుకెళ్లినా ఎన్నికల ప్రచారం మాత్రం ఆగదు : మనీశ్ సిసోడియా

లిక్కర్ స్కాం కేసులో తనకు సీబీఐ సమన్లు జారీ చేయడంపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ట్వీట్ల వర్షం కురిపించారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా.. భాజపా ప్లాన్‌లో భాగంగా తనను నకిలీ కేసులో అరెస్టు చేయనున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో తాను గుజరాత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సి ఉందన్న ఆయన.. తనను ఆపేందుకు చేసే ప్రయత్నమే ఇది అని తెలిపారు. ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుందని చెప్పారు. తాను గుజరాత్‌ వెళ్లినప్పుడు.. ఢిల్లీ లాంటి అద్భుతమైన పాఠశాలలు నిర్మిస్తామని చెప్పానని... కానీ  ఇది కొందరికి నచ్చడం లేదని చెప్పుకొచ్చారు. తాను జైలుకు వెళ్లడంతో ఈ ఎన్నికల ప్రచారం ఆగదని...  రానున్న రోజుల్లో ఆ ఎన్నికలు ఉద్యమంలా మారనున్నానని సిసోడియా భాజపాపై విమర్శలు చేశారు.

ఇయ్యాళ ఉదయం ఇంటి నుంచి సీబీఐ కేంద్రకార్యాలయానికి బయలుదేరేముందు సిసోడియా తన తల్లి ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత తన వెంట వచ్చిన పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇంతకుముందు వారు తన ఇంటిపై సోదాలు నిర్వహించారు... కానీ ఏమీ దొరకలేదని చెప్పారు. ఈ రోజు కూడా వారికి ఏమీ దొరకదని... తనను జైల్లో పెట్టి భాజపా ఎన్నికల్లో విజయం సాధించలేదని వ్యాఖ్యానించారు. ఇటీవలే మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని సిసోడియా వెల్లడించారు.